కరోనా ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2020 3:00 PM GMT
కరోనా ప్రభావం దశాబ్దాల వరకు ఉంటుంది

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1,78,22,966 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 6,84,167 మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ప్రపంచం స్తంభించిపోయింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. కరోనా వైరస్‌ వచ్చిన తరువాత మానవ జీవితంలో పరిస్థితులు అన్ని మారిపోయాయి. కాగా.. కరోనా ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ అంచనా వేశారు. వైరస్‌ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా అత్యవసర విభాగం మరోసారి సమావేశం అయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మొత్తం 30 మంది పాల్గొన్నారు. ఈ సమీక్షలో శానిటైజర్ల వాడకం, మాస్క్‌‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వంటి చర్యలను కొనసాగించే విషయంపై కమిటీ సంస్థకు కొన్ని సిఫార్సులను జారీ చేసింది.

చైనా వెలుపల 100 కేసులు, మరణాలే లేని సమయంలో ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాల్సి వచ్చిందని అధానోమ్‌ చెప్పారు. ఇలాంటి వైరస్‌లు 100 ఏళ్లలో ఒకసారి వెలుగుచూస్తాయన్నారు. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని వివరించారు. కరోనా విషయంలో శాస్త్ర సంబంధమైన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికీ ఎన్నో వాటికి సమాధానం దొరకాల్సి ఉందని చెప్పారు. చాలా మందికి వైరస్‌ ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ సోకి తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోనూ మరోసారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలిందని వివరించారు. వైరస్‌ తగ్గుముఖం పట్టిందని భావిస్తోన్న దేశాల్లో మరోసారి విజృంభిస్తోందని తెలిపారు. మొదట కరోనా పెద్దగా ప్రభావానికి గురికాని దేశాలు కూడా ఇప్పుడు ఆ సంక్షోభంలో చిక్కుకున్నాయని.. పలు దేశాలు వైరస్‌ను బాగా కట్టడి చేయగలిగాయని తెలిపారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 47లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1.56లక్షల మంది మృత్యువాత పడ్డారు. బ్రెజిల్‌లో 26లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 92వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో కూడా 16లక్షలకు పైగా కేసులు నమోదు 36వేలకు పైగా మంది మరణించారు.

Next Story