ట్రంప్ ప్రస్తావించిన మొయిల్ ఇన్ ఓటింగ్ అంటే ఇదే

By సుభాష్  Published on  1 Aug 2020 6:41 AM GMT
ట్రంప్ ప్రస్తావించిన మొయిల్ ఇన్ ఓటింగ్ అంటే ఇదే

అమెరికా అధ్యక్ష స్థానంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి నేత ఒకరు కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు. ఆ మాటకు వస్తే.. అమెరికన్ల ప్రజాతీర్పుయావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ట్రంప్ లాంటి నేతను ఎందుకు ఎంపిక చేసుకున్నారంటూ పలు దేశాలకు చెందిన వారు.. అమెరికన్లను తరచూ ప్రశ్నిస్తుంటారు. సంచలనాలకు.. వివాదాలకు పెట్టింది పేరైన ట్రంప్ పదవీ కాలం దగ్గరకు వచ్చింది. ఆ భవిష్యత్తును డిసైడ్ చేసే అధ్యక్ష ఎన్నికలు నవంబరు మూడున జరుగుతాయి.

ఈ సంప్రదాయం 1788 నుంచి అమలవుతోంది. అప్పడు స్టార్ట్ అయిన ఎన్నికల విధానం ఇప్పటివరకూ మధ్యలో ఎప్పుడూ బ్రేక్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బూచి చూపించి అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అందుకు తగ్గట్లే.. ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది. కరోనా వేళ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. మొయిల్ ఆన్ ఓటు విధానాన్ని ఎక్కువమంది అనుసరించే అవకాశం ఉందని.. దీంతో అక్రమాలకు అవకాశం ఉంటుందన్న వాదనను ట్రంప్ తెర మీదకు తెచ్చారు.

ట్రంప్ ట్వీట్ ను విపక్ష డెమొక్రాట్లు మాత్రమే కాదు.. రిపబ్లికన్ నేతలూ తప్పు పడుతున్నారు. అసలు ఆయనెలా మాట్లాడతారు? అని ప్రశ్నిస్తున్నారు.

ట్రంప్ ట్వీట్ కు విపక్షాల సంగతి తర్వాత.. అధికార పార్టీకి చెందిన వారు సైతం మద్దతు ఇవ్వట్లేదు. దీంతో.. ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మొయిల్ ఇన్ ఓటింగ్ విధానంతో వచ్చే ఇబ్బందులేమిటి? దాని ద్వారా అవకతవకలు ఎలా చోటు చేసుకుంటాయన్న విషయాన్నివివరించి చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలీ ప్రక్రియ ఏమిటన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈ విధానం అమెరికాలోని కాలిఫోర్నియా..కొలరాడో.. హవాయి.. ఒరెగాన్.. ఉతా.. వెర్మాంట్.. వాషింగ్టన్ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం (2000లో) తొలిసారి ఈ విధానాన్ని ఒరెగాన్ రాష్ట్రంలో అమలు చేశారు. తర్వాతి కాలంలో మరో ఆరు రాష్ట్రాలు దీన్ని అమనుసరిస్తున్నాయి. ఈ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో.. ఈ విధానం కోరుకునే రిజిస్టర్ ఓటర్లకు ప్రభుత్వమే బ్యాలెట్ పేపర్ మొయిల్ చేస్తాయి. తమకు ఇష్టమైన అభ్యర్థిని ఎంపిక చేసుకొని ఓటు వేయొచ్చు. అనంతరం ఆ బ్యాలెట్ పేపర్ని ఓటర్లు తిరిగి మొయిల్ చేస్తారు. అలా కాదంటే.. ప్రింట్ అవుట్ తీసి.. తమకు దగ్గర్లోని బ్యాలెట్ బాక్సుల్లో వేసేందుకు అవకాశం ఉంటుంది.

మరి.. ఈ విధానంలో ట్రంప్ చెప్పినట్లుగా మోసాలు జరిగే వీలుందా? అంటే అవునని చెబుతారు. కానీ.. అలాంటి నేరాలకుపాల్పడే వారి సంఖ్య చాలా.. చాలా తక్కువగా చెబుతారు. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇప్పటివరకూ 25 కోట్ల మంది బ్యాలెట్ లో మొయిల్ చేయగా.. కేవలం 12 సందర్భాల్లో మాత్రమే అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు. రిపబ్లికన్లు సైతం ఇప్పటివరకూ ఈ విధానంపై ఆరోపణలు చేయకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ వెనక్కి తగ్గటం మినహా మరో మార్గం లేదనే చెబుతున్నారు.

Next Story