Fact Check : తొంగి చూస్తున్న చిరుతపులికి సంబంధించిన ఫోటో హైదరాబాద్‌కు చెందినదేనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చాయంటే జనాల గుండెల్లో హడల్.. కొన్ని కొన్ని సార్లు అవి జంతువుల మీద దాడి చేయడమో.. లేదంటే ప్రజల చేతుల్లో అవి చనిపోవడమో జరుగుతూ ఉంటాయి. మనిషి స్వార్థానికి ఇప్పటికే చాలా వరకూ అడవులు నాశనమవుతూ ఉన్నాయి. ఆ జంతువులు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక అల్లాడుతూ ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక అవి ఏ కోళ్లనో, కుక్కలనో వేటాడడానికని జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ మహానగరంలోకి వన్య ప్రాణులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. చిరుతపులుల సంచారానికి సంబంధించిన వార్తలను తరచూ చూస్తున్నాం. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. చిరుతపులి ఓ ఇంట్లోకి తొంగిచూస్తోందంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. దీన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.
హైదరాబాద్ లోని రాజేందర్ నగర్ దగ్గర ఉన్న ఐసిఏఆర్-నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ మేనేజ్మెంట్ క్యాంపస్ వద్ద చిరుతపులి వచ్చిందని.. టీవీ 9 ఛానల్ కథనాలను ప్రసారం చేసింది. అందులో చిరుతపులి తొంగి చూసిందంటూ.. సీసీటీవీ విజువల్స్ లో రికార్డు అయిందని.. కథనాలను ప్రసారం చేసింది.
నిజనిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ విజువల్స్ పై గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వారం కంటే ముందే చిరుతపులి తొంగిచూస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో గమనించవచ్చు. టీవీ 9.. ఇతర మీడియా ఛానల్స్ చెబుతున్నట్లుగా జూన్ 8న హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ దగ్గర చిరుత తొంగిచూసింది అన్నది 'పచ్చి అబద్ధం'.
మరింత లోతుగా వెతగ్గా.. సౌత్ ఆఫ్రికాకు చెందిన Klaserie Camps అనే వన్య ప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించిన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒరిజినల్ ఫోటోను చూడొచ్చు. సౌత్ ఆఫ్రికా లోని గ్రేటర్ క్రూగర్ నేషనల్ పార్క్ లో Klaserie Camps కూడా ఒక భాగమే. క్లసేరీ నది ప్రాంతంలో 60000 హెక్టార్లలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.
“A peeping Tom …. literally! This young male, whom we’ve known since a cub with his sister, is approximately 2 years old, came to visit Frikkie & Natasha at their home at Dundee last night. They do not have a pet, so we’re curious as to his behaviour. What a sighting! (sic)” అంటూ మే 15న ఈ ఫోటోను Klaserie Camps ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.
రెండేళ్ల టామ్ ఫ్రాకీ, నటాషాలు ఇంట్లో ఉన్నారా లేదా అంటూ తొంగి చూస్తోందని ఆ పోస్టులో రాసుకుని వచ్చారు.
ఆ చిరుతకు సంబంధించిన మరిన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
టీవీ9 చెబుతున్నట్లుగా హైదరాబాద్ లోని రాజేందర్ నగర్ లో చిరుత తొంగి చూస్తోంది అన్నది 'పచ్చి అబద్ధం'. ఆ ఫోటోలు సౌత్ ఆఫ్రికాకు సంబంధించినవి.