బీజేపీతో 'కలిసుందాం రా' పాట పాడుతున్న పవన్ కళ్యాణ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2019 6:09 AM GMT
బీజేపీతో కలిసుందాం రా పాట పాడుతున్న పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ విమర్శించిన బిజెపీతో “కలిసుందాం రా” అన్న పాటను పాడబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇన్నాళ్లూ బీజేపీ కేవలం ప్రత్యేక హోదా అంశం విషయంలోనే దూరంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఒక విలేఖరి బీజేపీతో జనసేన విలీనం కాబోతుందా అని ప్రశ్నించినప్పుడు ఆయన అసలు మేము బీజేపీకి దూరం ఏనాడూ లేమని వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసే విషయం గురించి అడుగగా జనసేన భవిష్యత్తు గురించి తాను ఇప్పుడే చెప్పలేనని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని ఆయన అన్నారు.

వైకాపా నేతలు తనను టీడీపీ బీ టీమ్ అని విమర్శించడం పై వ్యాఖ్యానిస్తూ తాను టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే వైకాపాకి ఏ గతి పట్టి ఉండేదో గుర్తించాలని ఆయన అన్నారు. ఇరు పార్టీలతో దూరంగా ఉండాలన్నది సిద్ధాంతం ఆదారంగా తీసుకున్న నిర్ణయమని, తాను తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడినందుకు వైకాపా తన పట్ల కృతజ్ఞతతో ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

మత మార్పిడుల పట్ల తన వ్యతిరేకతను తేటతెల్లం చేస్తూ ఆయన తాను సెక్యులర్ గా ఉంటూనే హిందూ ధర్మం కోసం పాటుపడతానని అన్నారు. మత మార్పిడులపై ప్రభుత్వం తన వైఖరిన స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అన్ని ధర్మాలను సమానంగానే భావిస్తానని చెబుతూ, ఒక మతం ప్రభావ క్షేత్రం లోకి ఇంకొకరు చొరబడటాన్ని తాను సహించబోనని ఆయన అన్నారు.

తన సెక్యులర్ వైఖరిని సమర్థించుకుంటూనే ఆయన కుహనా సెక్యులర్లను తూర్పార పట్టారు. ఈ శక్తులు ఒక మతం పై ఇంకొక మతాన్ని ఉసి గొల్సుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడ పుష్కర ఘాట్ లో నలభై మంది హిందువులను మత మార్పిడి చేసిన ఘటన పై దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించకపోవడాన్ని ఆయన తప్పు బట్టారు. “దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో దాని మౌనాన్ని మత మార్పిడులకు అంగీకారంగా భావించాల్సి ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్, సీనియర్ నేతలు హరిప్రసాద్, అర్హన్ ఖాన్ లు కూడా ఈ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

Next Story