వారిని అడ్డుకునే అధికారం మీకు ఎవరిచ్చారు.?
By Medi Samrat Published on 19 Nov 2019 4:45 PM ISTముఖ్యాంశాలు
- జనసైనికులకు అండగా పవన్ కళ్యాణ్
- జెండాలు కట్టడమే నేరమా..?
- మహిళలపై చేయి చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు
- అక్రమంగా అరెస్ట్ చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలకు(జన సైనికులకు) బాసటగా నిలిచాడు. అక్రమ కేసులతో పీడింపబడుతున్న వారి పక్షాన నిలబడ్డాడు. గ్రామ తిరునాళ్లలో నాటకం ప్రదర్శిస్తున్న జనసైనికులను అడ్డుకున్న పోలీసు అధికారి తీరును ఎండగట్టాడు. ఈ మేరకు జనసేనాని ఓ లేఖను విడుదల చేశాడు.
పవన్ లేఖలో.. ధర్మవరం గ్రామం ఒక పోలీస్ ఉద్యోగి అనాలోచిత, విచక్షణారహిత, పక్షపాత వ్యవహారశైలివల్ల నేడు అశాంతితో అల్లాడిపోతోంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఉన్న ఈ గ్రామంలో చాలామంది పురుషులు పోలీస్ భయం కారణంగా గ్రామం వదిలి ఇతర ప్రాంతాలలో తలదాచుకోవలసిన దురదృష్ట పరిస్థితిని పోలీసులు సృష్టించారు. శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీసులే అశాంతికి కారణమైతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? గ్రామంలో ఏటా జరిగే తిరునాళ్లలో ఆనందంగా నాటికను ప్రదర్శించడమే పాపమా? ఆ నాటికలో జనసేన జెండాలు ప్రదర్శించడమే నేరమా? నాటికను మధ్యలో బలవంతంగా ఆపేసే అధికారం ఆ పోలీస్ ఉద్యోగికి ఎవరిచ్చారు? ఈ నాటిక ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది పోలీసులే.. దీనిని ప్రశ్నించిన మహిళలను నెట్టివేయమని (మాన్ హ్యాండ్లింగ్) ఏ చట్టం చెబుతోంది? లాఠీలతో కొట్టడానికి ఆ అధికారికి ఎవరు అనుమతి ఇచ్చారు. ఆడవారిపై దౌర్జన్యం చేసి గ్రామస్తులను రెచ్చగొట్టిన పోలీసుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను జనసేన కోరుతోంది. అక్రమంగా అరెస్టుచేసిన జనసేన కార్యకర్తలు నాగేశ్వర రావు, బి.రమేష్ లను తక్షణం విడుదల చేయాలి. మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలి. ఎవరు రెచ్చగొట్టినప్పటికీ, మనల్ని ఎవరు దూషించినప్పటికీ శాంతియుతంగానే సమాధానం చెబుదాం.ఇటువంటి విషయాలలో జనసైనికులు సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బాధితులకు జనసేన అండగా ఉంటుందని పెర్కోన్నాడు
ఇదిలావుంటే.. తన దృష్టికి వచ్చిన సమస్యలపై పవన్ కళ్యాణ్ లేఖ ద్వారానో.. ట్విట్టర్ ద్వారానో స్పందిస్తారు. గతంలో కూడా ఆయన.. భవన నిర్మాణ కార్మికుల బాధలు చూడలేక సీఎం జగన్ కు కూడా లేఖ రాశారు. ఇసుక కొరత వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజులపాటు ప్రభుత్వానికి సమయం ఇద్దామని అనుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనేక వినతులు అందినా సంయమనం పాటించామన్నారు. ఇసుక కొరత వల్ల పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 5లోగా ఇసుక విధానం ప్రకటిస్తామని జగన్ చెప్పారు, మరి అప్పటి దాకా కూలీ పనులు చేసుకొనే జీవించే వారికి జీవనాధారం ఏంటని పవన్ ప్రశ్నించారు. కార్మికులు, కూలీల ఆకలి బాధలు రాష్ట్రానికి మంచిది కాదని జనసేనాని జగన్‌కు సూచించారు. భవన నిర్మాణ కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని సీఎం జగన్‌ను కోరారు.