పుట్టినరోజు, కేక్ కటింగ్ లపై తన నిర్ణయాన్ని చెప్పిన పవన్ కళ్యాణ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sep 2020 2:21 PM GMTసెప్టెంబరు 2.. జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజున అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈసారి పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. పలు జిల్లాలలో ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించే మంచి పనిని చేస్తూ ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూను జనసేన పార్టీ తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేసింది. పుట్టినరోజు, కేక్ కటింగ్ లపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తు అని చెప్పారు. తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని.. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు ఎప్పుడూ చేసుకోలేదని అన్నారు పవన్. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేదని.. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా నచ్చేది కాదని అన్నారు. జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు.. దీనికి వేరే కారణాలేవీ లేవని పవన్ తెలిపారు. తాను కూడా ఒక సాధారణ మనిషిని అన్న విషయాన్ని నమ్ముతానని సుస్వాగతం సినిమా హిట్ అయిన తర్వాత చోటు చేసుకున్న ఘటన గురించి గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ బ్రేక్ తర్వాత నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ పాటికి సినిమా విడుదలయ్యుండేదే కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఇంకో రెండు వారాల షూటింగ్ పెండింగ్ ఉంది. అది పూర్తవ్వగానే సినిమా విడుదల పక్కా అని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు వకీల్ సాబ్ నుండి ఓ గిఫ్ట్ అందనుంది. చిత్ర నిర్మాతలు బోని కపూర్, దిల్ రాజు రేపు ఉదయం 9గం.ల 9 నిమిషాలకి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. రేపు టీజర్ రిలీజ్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నివేదా థామస్, అంజలి కీలక పాత్రలల్లో కనిపించనున్నారు.