భూమిపూజ వేళ.. దశావతారం సినిమాను గుర్తుకు తెచ్చిన ఫోటో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 7:38 AM GMT
భూమిపూజ వేళ.. దశావతారం సినిమాను గుర్తుకు తెచ్చిన ఫోటో

దాదాపు పన్నెండేళ్ల క్రితం విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమా గుర్తుందా? అందులో రెండో జన్మలో ఆసిన్ తమిళ వైష్ణవ కుటుంబంలో పుట్టటం.. హీరోకు కనిపించటం.. ఇలాంటి సీన్లను వదిలేస్తే.. ఆ సందర్భంగా వైష్ణవ కుటుంబం ఎంత నిష్ఠగా ఉంటుందో కొన్ని సీన్లలో కళ్లకు కట్టేలా కనిపిస్తాయి.

దాదాపు అలాంటి సీన్ గుర్తుకు వచ్చే ఫోటో ఒకటి అయోధ్యలోని రామాలయ భూమిపూజ వేళ.. బయటకు వచ్చింది. వందల ఏళ్ల నాటి వివాదం ఒక కొలిక్కి వచ్చి.. సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయాన్ని వెలువరించటంలో కీలకభూమిక పోషించిన వారిలో ముందుంటారు సీనియర్ న్యాయవాది కె. పరాశరన్.

తమిళనాడుకు చెందిన ఈ సీనియర్ న్యాయవాది అయోధ్య కేసు విషయంలో ఎంత కఠోరంగా శ్రమించారో అందరికి తెలిసిందే. ఆయన వినిపించిన వాదనలకు కన్వీన్స్ కావటంతోనే దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్య వివాదానికి రామాలయానికి దన్నుగా తీర్పు ఇచ్చిందని చెప్పాలి.సుదీర్ఘకాలం ఈ కేసును వాదించిన ఆయన.. ఒకసందర్భంలో తన వాదనలు వినిపిస్తున్న వేళ.. ధర్మాసనం జోక్యం చేసుకొని ఆయన్నుకూర్చొని వాదనలు వినిపించాల్సిందిగా కోరింది.

కారణం.. అంత పెద్ద వయసులో ఆయన పడుతున్న శ్రమనే. కానీ.. ఆ సూచనను సున్నితంగా తిరస్కరించి మరీ నిలబడే వాదనలు వినిపించారు. కమిట్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. భూమిపూజ వేళ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఒక ఫోటో బయటకు వచ్చింది.

ఒక కుర్చీలో సంప్రదాయ వస్త్రధారణ (సాధారణంగా శుద్ధ శ్రీ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో కనిపించేలా) లో కూర్చొని టీవీలో వస్తున్న అయోధ్య రామాలయ భూమిపూజ కార్యక్రమాన్ని కనులారా వీక్షిస్తుంటే.. ఆయన చుట్టూ.. పెద్ద సంఖ్యలో ఉన్న వారంతా.. అలాంటి వేషధారణలో కొందరునేల మీద కూర్చొని.. ఇంకొందరు నిలబడి టీవీని తన్మయత్వంతో చూస్తున్న వైనం అందరిని ఆకర్షించింది.

Advertisement

పరాశరన్ వెనుక ఇద్దరు మహిళలు భక్తిపారవశ్యంతో చూస్తున్న వైనం ఫోటోకే హైలెట్ గా చెప్పాలి. ఇలాంటి ఎందరో పడిన శ్రమకు ఫలితమే అయోధ్యలో రామాలయ నిర్మాణంగా చెప్పక తప్పదు. ఈ ఫోటోను చూసినంతనే దశావతారం సినిమాలోని వైష్ణవ బ్రాహ్మణ కుటుంబం చప్పున గుర్తుకు రాక మానదు.

కాకుంటే.. ఒకే ఒక్క అంశం మీద మాత్రం ఆందోళన కలుగుతుంది ఈ ఫోటో చూసినప్పుడు. కరోనా మహమ్మారి వేళ.. ఇంతమంది ఒకేచోట.. ఎలాంటి భౌతికదూరాన్ని పాటించకుండా.. ముఖాలకు మాస్కులు ధరించకుండా టీవీ చూస్తుండటం చూసినప్పుడు మాత్రం.. ఏమన్నా ముప్పు వాటిల్లుతుందేమోనన్న భావన చప్పున కలుగక మానదు.

Next Story
Share it