దశాబ్దాల కల నెరవేరింది.. ప్రధాని మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 9:14 AM GMT
దశాబ్దాల కల నెరవేరింది.. ప్రధాని మోదీ

అయోధ్యలో రామందిర భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లడారు. ఇదొక చారిత్రాత్మక దినమని ప్రధాని అన్నారు. ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించవలసిన అవసరం ఉందన్నారు. వందల ఏళ్ల నిరీక్షణ ఈ రోజు ముగిసిందని తెలిపారు. ఈ రోజు నేను ఇక్కడ ఉండడం తన అదృష్టంగా బావిస్తున్నానని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు.

ఈ నాటి ఈ జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు.. కానీ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు వినిపిస్తాయన్నారు. దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయిందన్నారు. దశాబ్దాల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానం చేశారని.. వారందరి బలిదానాలతో, త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. 130 కోట్ల ప్రజలు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారని తెలిపారు.

రాముడు మన అందరిలో ఉన్నాడని, మన సంస్కృతికి రాముడే ఆదారమని మోదీ చెప్పారు. సత్యం, అహింస, శాంతి, విశ్వాసం, త్యాగనిరతికి పెట్టింది పేరయిన ఈ దేశం ధర్మాన్ని ప్రభోదిస్తుందంటే అది రాముడి చలవేనని అన్నారు. శ్రీ రాముడి ఆదర్శాలు కలిగియుగంలో పాటించేందుకు మార్గమిదన్నారు. కోటాను కోట్ల హిందువులకు ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం శిలాఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు. రామమందిరం నిర్మాణ చిహ్నంగా పోస్టల్‌ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు.

Next Story