రామ మందిరం భూమి పూజపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ క్రికెటర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 9:39 AM GMT
రామ మందిరం భూమి పూజపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ క్రికెటర్

రామ మందిరం నిర్మాణంపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇదొక చారిత్రాత్మక ఘటన అంటూ పలువురు చెబుతూ వస్తున్నారు. హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఘట్టం అని ఇప్పటికే చెప్పుకొచ్చారు. రామ మందిరం భూమి పూజపై పాకిస్థాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు.

శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని కనేరియా చెప్పాడు. చెడుపై ఎల్లప్పుడూ మంచే గెలుస్తుందని తెలపడానికి రాముడు ఓ ఉదాహరణ అని అన్నాడు. అయోధ్యలో రామ మందిర భూమి పూజతో ప్రపంచంలోని హిందువులు అందరూ చాలా ఆనందిస్తూ ఉన్నారని.. ఆత్మ సంతృప్తికి ఈ భూమిపూజ ఓ గొప్ప కార్యమని చెబుతూ ట్వీట్లు చేశాడు కనేరియా.

హిందువు అన్న కారణంతో డానిష్ కనేరియాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చిన్న చూపు చూస్తోంది. మ్యాచ్‌ ఫిక్సింగ్ కారణంగా జీవితకాల నిషేధానికి గురయ్యాడు డానిష్ కనేరియా. సరిగా విచారణ కూడా చేయకుండానే డానిష్ కనేరియాపై జీవితకాలం నిషేధం విధించింది. ఒక హిందువు అయినందునే పీసీబీలో తనకు మద్దతు దొరకడం లేదని గతంలోనూ వాపోయాడు డానిష్ కనేరియా.

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోదని చెప్పారు. బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Next Story