ఓటీటీల్లో అవి వస్తాయి.. ఇవి మాత్రం రావు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 10:28 AM GMT
ఓటీటీల్లో అవి వస్తాయి.. ఇవి మాత్రం రావు

మొత్తానికి టాలీవుడ్ నిర్మాతల్లో కదలిక వచ్చింది. ఐదు నెలలకు పైగా థియేటర్లు మూతపడి ఉండటం, సమీప భవిష్యత్తులో అవి తెరుచుకునే అవకాశం లేకపోవడంతో తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్న వాళ్ల ఆలోచనల్లో మార్పు వచ్చింది. బాలీవుడ్ సహా మిగతా ఇండస్ట్రీలు పెద్ద పెద్ద సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తుండగా.. తెలుగు నిర్మాతలు మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు.

ఓవైపు ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా, ఇంకోవైపు వడ్డీల భారం పెరిగిపోతున్నా.. వాళ్లు మాత్రం థియేట్రికల్ రిలీజ్ విషయంలో పట్టుబట్టి కూర్చున్నారు. కానీ ఇలా ఎంత కాలం ఉంటాం అన్న ఆలోచన మెదిలి.. చివరికి తమ చిత్రాల్ని ఓటీటీల్లోనే నేరుగా రిలీజ్ చేసేయడానికి కొందరు నిర్మాతలు ముందుకొచ్చారు. అందులో దిల్ రాజు కూడా ఉండటం విశేషం.

నాని-సుధీర్ బాబు కాంబినేషన్లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజు నిర్మించిన ‘వి’ చిత్రాన్ని అతి త్వరలోనే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నారని.. రూ.32 కోట్లకు ఈ డీల్ తెగిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో పాటు మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నట్లు కూడా చెబుతున్నారు. మరి ఆ సినిమాలేంటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రామ్ హీరోగా కిషోర్ తిరుమల రూపొందించిన ‘రెడ్’తో పాటు కీర్తి సురేష్ మూవీ ‘మిస్ ఇండియా’, సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ను మాత్రం ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయరట. కొత్త హీరోను అలా పరిచయం చేస్తే బాగోదన్న ఉద్దేశంతో ఆగుతున్నారు. అలాగే రవితేజ సినిమా ‘క్రాక్’ కూడా ఎప్పటికైనా నేరుగా థియేటర్లలోనే రిలీజవుతుందట. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతానికి కొత్త సినిమాల విడుదల విషయంలో ఉన్న క్లారిటీ ఇది.

Next Story