చిరంజీవికి ‘మెగాస్టార్’ టైటిల్ ఇచ్చిందెవరు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 11:47 AM GMT
చిరంజీవికి ‘మెగాస్టార్’ టైటిల్ ఇచ్చిందెవరు?

బాలీవుడ్ వాళ్లు అమితాబ్ బచ్చన్‌ను మెగాస్టార్ అనే పిలుస్తారు కానీ.. ఇండియాలో మెజారిటీ ప్రేక్షకులు మెగాస్టార్‌గా భావించేది చిరంజీవినే. ఆ టైటిల్‌కు చిరు తెచ్చిన పాపులారిటీనే వేరు. చిరంజీవిని ఎవ్వరూ ఆ పేరుతో సంబోధించరు. ముందు ‘మెగాస్టార్’ తప్పక చేరుస్తారు. అసలు చిరు పేరే ఎత్తకుండా మెగాస్టార్ అనే ఆయన్ని సంబోధించేవాళ్లే ఎక్కువ.

కెరీర్ ఆరంభంలో సుప్రీం హీరో అని చిరుని పిలిచేవాళ్లు. కానీ తర్వాత ఆయన ‘మెగాస్టార్’ అయ్యారు. ఇంతకీ చిరుకు ఆ టైటిల్ ఇచ్చిందెవరు.. ఏ సినిమాతో ఆయన ‘మెగాస్టార్’గా మారారు అనేది ఆసక్తికరమైన విషయం. ఈ ఘనత సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావుకే చెందుతుంది.

చిరుతో అభిలాష, మరణమృదంగం, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత ఆయన. ‘మరణ మృదంగం’ సినిమా టైటిల్స్‌లో తొలిసారిగా చిరు పేరు ముందు ‘మెగాస్టార్’ అని వేసింది తమ సంస్థే అని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

ఈ సినిమాకు ముందు చిరు చిత్రాల వసూళ్లు, ఆయన ఆకర్షణ చూసి తాను ఆశ్చర్యపోయానని.. అప్పటికే ఆయన్ని సూపర్ స్టార్ అని, సుప్రీం హీరో అని అంటుండేవాళ్లని.. కానీ ఆయన స్థాయికి ఇంకా ప్రత్యేకంగా ఏదైనా ఉండాలనిపించిందని.. అందుకోసం వేరే టైటిల్ కోసం వెతికామని.. అలా బాగా ఆలోచించి ఇంతకంటే మంచి బిరుదు ఎవ్వరూ ఇవ్వలేరు అనిపించేలా ‘మెగాస్టార్’ అని పెట్టామని.. ‘మరణమృదంగం’ సినిమాకే చిరు పేరు ముందు ‘మెగాస్టార్’ అని వేశామని.. దానికి అద్భుతమైన స్పందన వచ్చి తర్వాత అందరూ దాన్నే కొనసాగించారని రామారావు వెల్లడించారు.

Next Story