హాస్టల్స్ వెంటనే ఖాళీ చేయండి.. విద్యార్థులకు వీసీ ఆదేశాలు..
By అంజి
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌పూల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రదేశాల్లో తిరగొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. పలు చోట్ల పర్యాటక ప్రదేశాలు, రెస్టారెంట్లు, బార్లను మూసివేస్తున్నారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అన్ని హాస్టళ్లను, మెస్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో.. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి హాస్టళ్లకు మంచినీరు, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. పీజీ విద్యార్థులు, యూనివర్సిటీ స్కాలర్స్‌తో పాటు అందరూ హాస్టళ్లు ఖాళీ చేయాలని సూచించారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మాత్రం.. విద్యార్థులు హాస్టళ్లులో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు. అయితే వారందరినీ ఉన్న పళంగా ఇంటికి వెళ్లమని చెబితే చాలా ఇబ్బందులు పడతారని.. ఈ మేరకు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చామని తెలిపారు.
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 14 మంది కరోనా అనుమానితులు చేరారు. కరోనా భయంతో సోమవారం ఉదయం అంబర్ పేటకు చెందిన యువతి, వారసిగూడకు చెందిన యువకుడు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వీరందరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.