ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫీజుల డిమాండ్‌.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

By సుభాష్  Published on  8 July 2020 1:43 PM IST
ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫీజుల డిమాండ్‌.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

ముఖ్యాంశాలు

  • ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో అక్రమ వసూళ్లు

  • ప్రభుత్వాల ఆదేశాలు పెడచెవిన పెడుతున్న యాజమాన్యాలు

  • స్కూళ్లకు వెళ్లకున్నా.. యూనిఫాం, బుక్స్‌ కొనాల్సిందే

  • నిబంధనలు తుంగలో తొక్కుతున్న ప్రైవేటు యాజమాన్యాలు

  • లబోదిబోమంటున్న పేరెంట్స్‌

  • అధిక ఫీజలు వసూళ్లను అరికట్టాలంటూన్న విద్యార్థుల తల్లిదండ్రులు

తెలుగు రాష్ట్రాలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక కరోనా కట్టడి కోసం ఇప్పటికే విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థలతో పాటు పరీక్షలన్నీ రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో కార్పొరేట్‌ పాఠశాలలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయని పేరెంట్స్‌ కమిటీ నాయకులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నామంటూ భారీగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు పేరెంట్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల తీరుతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరోతో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యాజమాన్యం.. డబ్బులు చెల్లించకుంటే విద్యార్థుల అడ్మిషన్‌ రద్దు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పుడుతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఎలాంటి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించరాదని ప్రభుత్వం సూచించినా యాజమాన్యాలు ఏ మాత్రం లెక్క చేయడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీని అరికట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ కూడా జరిపింది. ఆన్‌లైన్‌ విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ, పాఠశాలల ప్రారంభోత్సవానికి ముందే అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఆన్‌లైన్‌ క్లాసుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన పాలసీని రూపొందించలేదని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత అందరికి ఉంటుందా..? అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం కరోనా కాలంలో ముందే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్లు కొనే పరిస్థితి లేదని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రైవేటు పాఠశాలల అక్రమ దోపిడీని అరికట్టాలంటూ వారు కోరుతున్నారు.

స్కూలుకు వెళ్లకున్నా యూనిఫాం, బుక్స్‌ కొనాల్సిందే..

కరోనా కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఒత్తిడి ఏ మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు హెచ్చరించినా ప్రైవేటు విద్యాసంస్థల వసూళ్ల దందా కొనసాగుతోంది. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లకున్నా యూనిఫాం, బుక్స్‌ కొనాల్సిందేనంటూ తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం హుకూం జారీ చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అలాగే పాఠశాలలకు వెళ్లకున్నా ట్రాన్స్‌ పోర్ట్‌ ఫీజు చెల్లించాలని కొన్ని విద్యాసంస్థలు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా రోజుకు రెండు గంటలు మాత్రమే చెబుతూ ఫీజుల కోసం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఒత్తిళ్ల సతమతమవుతున్నామని, ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలలు లేకున్నా ఎప్పటిలాకే యథావిధిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఒక వేళ ఫీజు కట్టకపోతే ఈ ఏడాది అడ్మిషన్‌ ఉండదంటూ బ్లాక్‌ మెయిన్‌ చేస్తున్నారని, దీంతో విద్యార్థుల చదువు పాడైపోతుందేమోననే భయం పట్టుకుందని అంటున్నారు. అలాగే కొన్ని కార్పొరేట్‌ సంస్థలు తమవద్దే ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లు కొనాలని మొండిపట్టు బడుతున్నాయని, మెడమీద కత్తిపెట్టినట్లు డబ్బులు వసూలు చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Next Story