'ఒక దేశం - ఒక రేషన్'‌ ప్ర‌యోజ‌న‌మిదే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 9:24 AM IST
ఒక దేశం - ఒక రేషన్‌ ప్ర‌యోజ‌న‌మిదే..

కేంద్ర ప్రభుత్వం వ‌న్ నేష‌న్ - వ‌న్‌ రేషన్ కార్డు విధానం తెరపైకి తెచ్చింది. దీని ప్రయోజనం ఏమిటంటే.. తమ గ్రామాన్ని విడిచిపెట్టి ఎవ‌రైతే.. ఉపాధి లేదా ఇతర అవసరాలకు వేరే ప్రాంతాలకు వెళ్ళే పేద వ‌ల‌స‌ కార్మికులు అక్కడ కూడా తమ రేషన్ పొందవచ్చు.

మంగ‌ళ‌వారం జాతీనుద్దేశించి మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2.0 కింద పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద పేదలకు 5 కిలోల గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పు ఉచితంగా ఇవ్వబడుతుంది. నవంబర్ వరకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్ర‌భుత్వానికి 90 వేల కోట్ల అదనపు వ్యయం అవుతుందని ప్రధాని చెప్పారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి నవంబర్ వరకు ఒకటిన్నర లక్షల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రధాని చెప్పారు.

కరోనా మహమ్మారి విస్తృతి.. లాక్‌డౌన్‌ ప్రభావాల నుండి ప్రజలను నివారించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 1.70 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కింద ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్, మహిళలు, పేద సీనియర్ సిటిజన్లు, రైతులకు నగదు సహాయం ప్రకటించింది.

ఇందులో పీఎం కిసాన్ పథకం కింద నేరుగా 8 కోట్ల మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. అలాగే.. 31 వేల కోట్లు మహిళా జన ధన్ ఖాతాకు బదిలీ చేశారు. అంతేకాకుండా.. గడిచిన‌ మూడు నెలల్లో 20 కోట్ల పేద కుటుంబాల జన ధన్ ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు నేరుగా జమ కాగా.. 9 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనూ.. 18 వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి.

ప్ర‌ధాన‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కోసం దరఖాస్తు చేయడానికి విడిగా ఎటువంటి ప్రక్రియ లేదు. మీ రేషన్ కార్డు ద్వారానే ఈ పథకం ప్రయోజనం పొందుతారు. అయితే.. మీకు రేషన్ కార్డు లేకపోతే, మీరు దాని కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Next Story