గుండెలు అదిరేలా మహమ్మారికి సంబంధించిన రెండు అప్డేట్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jun 2020 10:01 AM GMT
గుండెలు అదిరేలా మహమ్మారికి సంబంధించిన రెండు అప్డేట్స్

ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్ లో మహమ్మారిని కంట్రోల్ చేయటంలో సక్సెస్ అయినట్లుగా బోలెడన్ని వార్తలు వచ్చాయి. ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే.. మహమ్మారి ముప్పు దాదాపుగా తగ్గిపోయినట్లేనని బోలెడన్ని వాట్సాప్ మేసేజ్ లు వచ్చాయి. అంతేకాదు.. తర్వాతి రోజుల్లో దీపాలు వెలిగించాలని.. గంటలు కొట్టాలని.. ఇలా పలురకాల టాస్కులు ఇచ్చిన ప్రధాని మోడీ మీద ప్రశంసల వర్షం కురిసింది. చూస్తుండగానే రెండున్న నెలలు గడిచిపోయాయి. మహమ్మారిని అదుపు చేయటంలో సాధ్యమైందన్న మాట స్థానే.. ఇప్పుడు చెలరేగిపోతున్న తీరు భయాందోళనకు గురి చేస్తోంది.

ఇలాంటివేళ.. రెండు బ్యాడ్ న్యూస్ లు బయటకు వచ్చాయి. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా 2.6లక్షలుగా నమోదైన పాజిటివ్ కేసులు వచ్చే నెలాఖరు నాటికి పది లక్షలకు చేరుకోవటం ఖాయమని చెబుతున్న వైనం వణికేలా చేస్తోంది. అంతేకాదు.. దేశ రాజధాని ఢిల్లీలో రానున్న రోజుల్లో మహమ్మారి మరింతగా విరుచుకుపడుతుందని చెబుతున్నారు. జులై చివరి నాటికి ఒక్క ఢిల్లీ మహానగరంలోనే 5.5 లక్షల కేసులకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆలోచించటానికే భయపడే పరిస్థితి. ఇంతకీ ఈ అంచనాలు ఎవరు వేశారు? వారిని ఎంతమేర నమ్మొచ్చు? అన్న విషయంలోకి వెళితే.. శివనాడార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సమిత్ భట్టాచార్య తాజా హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా కేసులు వచ్చే నెల చివరికి ఎనిమిది నుంచి పది లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఈ వాదనలో నిజం ఎంతన్నది లాజిక్ గా లెక్కేస్తే.. ఇప్పుడు సరాసరిగా రోజు పదివేల చొప్పున కొత్త కేసులు (మంగళవారం ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసులు 9,987) నమోదవుతున్నాయి. ప్రతి వారానికి రెండు వేల చొప్పున పెరిగే వీలుంది. అలా కూడా కాదనే అనుకుందాం. ఇప్పుడున్న పదివేలకే ఆగినా.. ఇప్పుడు నడుస్తోంది జూన్ 10. అంటే.. ఈ నెలలో మరో ఇరవై రోజులు ఉన్నాయి. జులైలో 31 రోజులు. అంటే.. మొత్తం 51 రోజులు. రోజుకుపది వేల చొప్పున లెక్కవేసినా ఐదు లక్షలకు పైగా కేసులు కన్ఫర్మ్.

ప్రతి వారానికి పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న లెక్కను అంచనా వేస్తే.. సమిత్ భట్టాచార్య చెప్పిన లెక్క సరిపోవటం కనిపిస్తుంది. ఒకవేళ.. ఈ అంచనా మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఢిల్లీలోని చాలా కేసుల్లో ఎలా సోకిందన్న విషయాన్ని తేల్చలేకపోతున్నారు. దీంతో.. కేసుల ముప్పు మరింత పెరగటం ఖాయమని చెప్పకతప్పదు. ఇదో బ్యాడ్ న్యూస్ అయితే.. మహమ్మారికి సంబందించిన బరో ఆందోళన కలిగించే అంశం.. పాజిటివ్ లలో ఆరోగ్యం విషమిస్తున్న రోగుల సంఖ్యలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని వరల్డో మీటర్ వెల్లడించింది.

మహమ్మారి బారిన పడిన వారిలో అత్యధికంగా అమెరికాలోనే ఉన్నారు. ఆ దేశంలో 16,907 మంది క్లిష్టపరిస్థితుల్లో ఉంటే.. భారత్ లో వీరి సంఖ్య 8,944 కావటం గమనార్హం. అమెరికాలో 20.33 లక్షల కేసుల్లో ఇంతమంది ఉంటే.. భారత్ లో కేసుల సంఖ్య 2.66లక్షలే. ఈ లెక్కన చూస్తే.. అమెరికా కంటే కూడా భారత్ లోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. పాజిటివ్ వచ్చిన వారిలో సీరియస్ కండిషన్ ఉన్న వారి సంఖ్య పెరిగే కొద్ది మరణాల సంఖ్య పెరగటం ఖాయం. ఈ పరిణామం భారత్ కు కచ్ఛితంగా బ్యాడ్ న్యూసేనని చెప్పక తప్పదు.

Next Story
Share it