చైనా దాచినా.. పై వాడు చెప్పేశాడు..!
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 2:53 AM GMTకరోనా వైరస్ ఎక్కడో చైనాలోని వుహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 72లక్షల మంది ఈ మహమ్మారి భారీన పడగా.. 4లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతలా ప్రపంచాన్ని అతలాకులం చేసిన ఈ మహమ్మారి ఇప్పటి వరకు భావిస్తున్న దానికంటే ముందుగానే ప్రబలి ఉండొచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వుహాన్‌లోని ఆస్పత్రిల వద్ద గతేడాది ఆగస్టు నుంచి వాహన రద్దీ గణనీయంగా పెరుగడాన్ని బట్టి వారు ఈ అంచనాకు వచ్చారు.
వుహాన్‌లోని ఐదు ఆస్నత్రుల వద్ద గతేడాది ఆగస్టు నెలాఖరు నుంచి డిసెంబర్ వరకు వాహనాల రద్దీ అంతకంతకూ పెరిగినట్లు శాటిలైట్ సమాచారాన్ని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు అయిన దగ్గు, జలుబుకు సంబంధించి ఆన్‌లైన్‌లో సర్చ్ చేశారని గుర్తించారు. వుహాన్‌లోనే అతిపెద్దదైన తియాన్యు ఆస్పత్రి ఎదుట 2018 అక్టోబర్‌లో 171 కార్లు పార్క్ చేయగా.. 2019లో అదే చోట అదే సమయంలో 285 వాహనాలు పార్క్ చేసినట్లు పేర్కొన్నారు. అంటే 67 శాతం వాహనాలు పెరిగినట్లు గుర్తించారు. ఇది అసాధారణమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డా.జాన్ బ్రౌన్ స్టెన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు చైనాలో నవంబర్‌లో వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని భావిస్తుండగా.. వైరస్ గురించి డిసెంబర్ 31న చైనా ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వోకు సమాచారమిచ్చింది.
కాగా.. హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనాన్ని చైనా కొట్టివేసింది. ట్రాఫిక్ రద్దీ వంటి అంశాల ఆధారంగా ఇలాంటి నిర్ధారణకు రావడం హాస్యాస్పదంగా ఉందని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ అన్నారు.