సాధారణంగా సర్వీసు పూర్తీ చేసుకున్న సిబ్బందికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా రిటైర్మెంట్ ను ఇస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన ఘటనలను మనం చూస్తూనే ఉంటుంటాం..! ఒక సంస్థలో పదవీ విరమణ చేసిన తరువాత ఆ వ్యక్తిని సత్కరించడం చాలా సాధారణం. సహోద్యోగులతో ఉన్న అనుబంధాలు, సరదా సంఘటనలు, అధిగమించిన కష్టాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు పలకడం కాస్త కష్టమే.. కానీ తప్పదు. తమిళనాడులోని వెల్లూర్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఇలాంటిదే ఇటీవల చోటు చేసుకుంది. అయితే అది ఉద్యోగికో/ ఉద్యోగినికో కాదు.. ఓ 'మారుతి జిప్సీ'కి..! 22 సంవత్సరాల పాటు కార్యాలయంలో పనిచేసిన మారుతీ జిప్సీ వాహనానికి ఇలా రిటైర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.


జిప్సీని రెండు దశాబ్దాలుగా పోస్టాఫీసుల సూపరింటెండెంట్ తనిఖీ వాహనంగా ఉపయోగించారు. వీడ్కోలు కార్యక్రమంలో పోస్టాఫీసు సిబ్బంది వాహనానికి దండలు వేయగా, అందరికీ స్వీట్లు పంపిణీ చేసింది. అప్పుడు ఉద్యోగులు కారుకు సెల్యూట్ చేసి కారుతో ఫోటోలు దిగారు. వెల్లూరులోని ప్రభుత్వ కార్యాలయాలలో ఇదేమీ ఆచారం కాకపోయినా.. అధికారులు ఈ వాహనంతో ఉన్న అనుబంధం కారణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మారుతి జిప్సీని మార్చి 24, 1999 న కొనుగోలు చేశారు. దీనిని 25 మంది సూపరింటెండెంట్లు ఉపయోగించారు. జిల్లాలోని జవాధు కొండలతో సహా కొండ ప్రాంతాల్లోని పోస్టాఫీసులను సందర్శించడానికి ఇది ప్రధానంగా ఉపయోగించబడింది. వాహనం తన జీవితకాలంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని అధికారులు పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం జిప్సీని ఇప్పుడు మెయిల్ మోటార్ సర్వీస్ కు అప్పగిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దీన్ని స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెల్లూర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది వద్ద జిప్సీ స్థానంలో మరొక ఆఫ్ రోడ్ కారు వచ్చి చేరింది. మారుతి జిప్సీ 1985 లో భారతదేశంలో అమ్మడం మొదలైంది. దీనికి భారీ ఫాలోయింగ్ దక్కింది. ప్రైవేట్ అమ్మకాలతో పాటు, పోలీసు, సాయుధ దళాలతో సహా ప్రభుత్వ విభాగాలలో జిప్సీని బాగా వినియోగించారు. సరళమైన నిర్మాణం, ఎక్కడికైనా వెళ్లగల సామర్ధ్యం ఈ వాహనానికి ఉండడంతో పెద్ద ఎత్తున సేల్స్ జరిగాయి.


సామ్రాట్

Next Story