రోడ్డుపై 2000 రూపాయల నోట్లు.. కుప్పలు కుప్పలుగా.. తీరా చూస్తే..

Rs. 2000 notes flood the streets of Vasai. 2000 రూపాయల నోట్లు.. అది కూడా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. జనం కూడా ఎగబడ్డారు

By Medi Samrat  Published on  6 Oct 2021 3:36 PM IST
రోడ్డుపై 2000 రూపాయల నోట్లు.. కుప్పలు కుప్పలుగా.. తీరా చూస్తే..

2000 రూపాయల నోట్లు.. అది కూడా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. జనం కూడా ఎగబడ్డారు.. ఒక్కొక్కరు తమకు దొరికిన నోట్లను చూసుకోగానే ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అవి ఒరిజినల్ నోట్లు కాదు..! షూటింగ్ కోసం ఉంచినవి. దీంతో తమకు డబ్బులు దొరికాయి అనే ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఇక షూటింగ్ లో పాల్గొంది ప్రముఖ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కావడంతో ఆయన్ను కూడా తిట్టుకున్నారు కొందరు. మరికొందరేమో షూటింగ్ అయిపోయాక ఆ ఫేక్ కరెన్సీని తీసేయలేదని.. చిత్ర యూనిట్ ను కూడా తిట్టారు.

షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ 'సన్నీ'షూటింగ్‌ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 'ఫ్యామిలీ మేన్‌'సిరీస్‌ తర్వాత తెలుగు దర్శకనిర్మాతలు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక వెబ్‌ సిరీస్‌ 'సన్నీ'. ఈ సిరీస్‌లో హీరోగా షాహిద్‌ కపూర్‌ నటించగా, విజయ్‌ సేతుపతి, రాశీ ఖన్నా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్‌లో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సన్నివేశంలో రూ. 2 వేల నోట్లు రోడ్డుపై పడిపోవాలి. దీని కోసం నకిలీ నోట్లను ఉపయోగించింది చిత్ర యూనిట్‌. షూటింగ్‌ అయిపోయాక వాటిని తీసేయకపోవడంతో కొంతమంది అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీ మహాత్ముడు ఫొటో ఉన్న నోట్లను రోడ్డుపై పారేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. షూటింగ్‌కి చిత్రబృందం అనుమతి తీసుకుందని, అయితే గాంధీజీకి అవమానం జరిగిందనే విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Next Story