ఇదొక వెరైటీ మ్యారేజీ..!
Online Marriage In Kurnool. వివాహ మండపంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లేకపోయినా వారి వివాహం సాంప్రదాయబద్దంగా
By Medi Samrat Published on 17 Aug 2021 2:22 PM ISTవివాహ మండపంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లేకపోయినా వారి వివాహం సాంప్రదాయబద్దంగా జరిగింది. అది కూడా వేద మంత్రాల నడుమ, బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది. దీనికంతా టెక్నాలజీ మహిమ అనే అనుకోవచ్చు. పెళ్లిళ్లు కూడా ఆన్ లైన్ లోనే అని ఎప్పుడు అనుకున్నారో ఏమో కానీ.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్ల విషయంలో ఎన్నెన్నో వింతలు చూస్తూ ఉన్నాం..! కర్నూలుకు చెందిన మధుసూదన్ రెడ్డి శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజిత. తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి – కవితల కుమారుడు దినేష్ రెడ్డిల వివాహం కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. అయితే ఫంక్షన్ మాత్రమే అక్కడ జరిగింది. మిగతా తంతు మాత్రం ఆన్ లైన్లో జరిగింది.
రజిత – దినేష్ రెడ్డిలకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిపించాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. వారిద్దరూ ఉద్యోగ రిత్యా ఆస్ట్రేలియాలో ఉండడంతో కరోనా నేపథ్యంలో వివాహం జరగలేదు. ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేనందున ఆన్ లైన్లో వివాహం జరిపించే విధంగా ఇలా ప్లాన్ చేశారు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఆస్ట్రేలియాలో మండపంలో ఉండి కర్నూలులో వేద పండితుడు తెలిపిన విధంగా ఆచరించారు. పెండ్లిలో తమ కుమార్తె, కుమారుడు లేనందున బాధగా ఉన్నా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వివాహం ఇలా జరిపించామని పెద్దలు తెలిపారు. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.