అభిన‌వ షాజ‌హాన్‌ : భార్య కోసం అచ్చం తాజ్‌మహల్ లాంటి ఇల్లు కట్టించాడు

MP man gifts Taj Mahal-like home to wife. ఆగ్రాలోని తాజ్ మహల్ కు ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా

By Medi Samrat  Published on  22 Nov 2021 10:08 AM IST
అభిన‌వ షాజ‌హాన్‌ : భార్య కోసం అచ్చం తాజ్‌మహల్ లాంటి ఇల్లు కట్టించాడు

ఆగ్రాలోని తాజ్ మహల్ కు ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! షాజహాన్ తన భార్యపై ప్రేమకు చిహ్నంగా ఐకానిక్ స్మారక కట్టడాన్ని తయారు చేసినట్లే.. తాజాగా ఓ భర్త తన జీవిత భాగస్వామికి అచ్చం తాజ్ మహల్ ను పోలిన ఇంటిని బహుమతిగా కట్టించాడు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఈ ఇల్లు నిర్మించబడింది. బుర్హాన్‌పూర్ నివాసి అయిన ఆనంద్ చోక్సే తన భార్య కోసం తాజ్ మహల్ తరహాలో ఓ ఇంటిని కట్టాడు. తాజ్ మహల్ యొక్క ఖచ్చితమైన ప్రతిరూపమైన 4 పడక గదుల ఇల్లు నిర్మించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది.

ఇంటి నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని ఇంటిని నిర్మించిన ఇంజనీర్ తెలిపారు. నిజమైన తాజ్ మహల్‌ను నిశితంగా అధ్యయనం చేశానని తెలిపాడు. ఇంటి లోపల కొన్ని నిర్మాణాల కోసం బెంగాల్ మరియు ఇండోర్ నుండి కళాకారులను తీసుకుని వచ్చారు. ఇంటి గోపురం 29 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది తాజ్ మహల్ లాంటి టవర్లను కలిగి ఉంది. ఇంటి ఫ్లోరింగ్ రాజస్థాన్‌లోని 'మక్రానా' నుండి తయారు చేయబడింది. ముంబైలోని కళాకారులచే ఫర్నిచర్ తయారు చేయబడింది. ఇందులో పెద్ద హాలు, కింద 2 బెడ్‌రూమ్‌లు, మేడమీద 2 బెడ్‌రూమ్‌లు, లైబ్రరీ మరియు మెడిటేషన్ హాల్ ఉన్నాయి.

అసలు తాజ్ మహల్ మాదిరిగానే ఈ ఇల్లు కూడా చీకటిలో మెరిసే విధంగా ఇంటి లోపల మరియు వెలుపల లైటింగ్ సెట్ చేయబడింది. ఇదంతా తన భార్య మీద ఉన్న ప్రేమతో చేయించానని ఆనంద్ చోక్సే తెలిపారు. షాజహాన్ భార్య ముంతాజ్ బుర్హాన్‌పూర్‌లో నగరంలో మరణించినందున.. తన నగరంలో తాజ్ మహల్ ఎందుకు నిర్మించబడలేదని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడినని ఆనంద్ తెలిపారు. షాజహాన్ మొదట తాజ్‌మహల్‌ను తపతి నది ఒడ్డున నిర్మించాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఆగ్రాలో నిర్మించారని చెబుతారు.


Next Story