మహారాష్ట్రలో ఒక వ్యక్తి ఇంధన ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. అదేమిటంటే గుర్రంపై ప్రయాణించడం. ఔరంగాబాద్‌కు చెందిన షేక్ యూసుఫ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. "నేను ఒక కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను. ఈ రోజు కూడా, నేను ప్రయాణించడానికి నా గుర్రాన్ని ఉపయోగిస్తాను. ఇది ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, ఇంధన ధరల పెరుగుదల దృష్ట్యా, గుర్రంపై వెళ్లడమే మంచి ఎంపిక, "అని యూసుఫ్ తెలిపారు. యూసుఫ్ తన రోజువారీ పనిలో భాగంగా గుర్రాన్ని ఉపయోగిస్తున్న వీడియోలను మనం చూడొచ్చు.
ఆ గుర్రానికి 'జిగర్' అని పేరు పెట్టారు యూసుఫ్. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో యూసుఫ్ దీనిని 40,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. "లాక్‌డౌన్ సమయంలో నేను దానిని కొన్నాను. నా బైక్ పని చేయడం లేదు, పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రజా రవాణా లేని సమయంలో నేను ప్రయాణించడానికి ఈ గుర్రాన్ని ₹ 40,000 వెచ్చించి కొన్నాను" అన్నారాయన.
అతని నిర్ణయంపై ఒక్కొక్కరు.. ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది వినియోగదారులు గుర్రాన్ని రవాణా పద్ధతిగా ఎంచుకోవడం సరికాదని, దానిని "జంతు హింస" అని పేర్కొన్నారు.