82 ఏళ్ల వయస్సులో అంతా ఏమి చేస్తారు చెప్పండి. తమ మనవళ్లతో ఆడుకుంటూ.. ఇంట్లో సేదతీరుతూ రిటైర్మెంట్‌ను ఆనందిస్తూ ఉంటారు. కానీ భారత్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉన్నాడు. కేరళ మాజీ ఎమ్మెల్యే ఎంజే జాకబ్ ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులతో పోటీపడి విజయం సాధించారు. ఫిన్‌లాండ్‌లో ఆదివారం ముగిసిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (WMAC) 2022లో ఆయన భారత్‌కు పతకాలను అందించాడు. 200, 80 మీటర్ల హర్డిల్స్‌లో ఆయన రెండు కాంస్య పతకాలు సాధించారు. మాజీ పిరవం ఎమ్మెల్యే ప్రస్తుతం తన ఆటతీరును మెరుగుపరచుకోడానికి, తదుపరి సంవత్సరం మాస్టర్స్‌లో బంగారు పతకం సాధించడానికి మరింత సాధన, శిక్షణ చేస్తానని చెప్పుకొచ్చారు.
జాకబ్ ఫిన్‌లాండ్‌లోని రాటినాన్ స్టేడియం నుండి మాట్లాడుతూ.. తన దేశానికి రెండు పతకాలను ఇంటికి తీసుకురావడం సంతోషంగా ఉందని..అప్పట్లో రాజకీయ నాయకుడిగా, ఇప్పుడు క్రీడాకారుడిగా దేశానికి సేవలందించానని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొంటానన్నారు. ఆయన 80+ విభాగంలో WMACలో రెండు హర్డిల్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆయనకు చిన్నప్పటి నుండి అథ్లెటిక్స్ పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారు. 2006 నుండి అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలలో పాల్గొనడం ప్రారంభించారు. అనేక పతకాలు అందుకున్నారు.