తెలంగాణ‌లో ఇదే తొలిసారి.. పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్న ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు

First Gay Wedding in Telangana.ప్రేమ.. ఎవ్వ‌రి మ‌ధ్య‌న ఎప్పుడు పుడుతుందో ఎవ్వ‌రు చెప్ప‌లేరు. ప్రేమ‌కు మంచి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Dec 2021 7:49 AM GMT
తెలంగాణ‌లో ఇదే తొలిసారి.. పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్న ఇద్ద‌రు మ‌గ‌వాళ్లు

ప్రేమ.. ఎవ్వ‌రి మ‌ధ్య‌న ఎప్పుడు పుడుతుందో ఎవ్వ‌రు చెప్ప‌లేరు. ప్రేమ‌కు మంచి, చెడు, వ‌య‌స్సు, కులం వంటి వాటితో సంబంధం లేదు. ఇద్ద‌రు అబ్బాయిల మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంతగా వారి మ‌ధ్య బంధం పెన‌వేసుకుపోయింది. ఇద్ద‌రు క‌లిసి పెద్ద‌వారిని ఒప్పించి.. అంద‌రి స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డో విదేశాల్లో జ‌రిగింద‌ని అనుకోకండి. మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే జ‌రిగింది. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో శ‌నివారం ఈ వివాహం జ‌రిగింది. ఇద్ద‌రు అబ్బాయిలు పెళ్లి చేసుకోవ‌డం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

వివ‌రాల్లోకి వెళితే.. సుప్రియో, అభయ్ అనే ఇద్ద‌రు ఎనిమిదేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా క‌లుసుకున్నారు. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. సుప్రియో హైదరాబాద్‌లో హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తుండ‌గా.. అభయ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి పెద్ద‌వారిని ఒప్పించారు. హైదరాబాద్ శివారు వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శ‌నివారం బంధుమిత్రులు, పెద్ద‌ల స‌మ‌క్షంలో వీరిద్ద‌రు ఒక్క‌టి అయ్యారు. వీరి వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు, సంగీత్‌ వంటి కార్యక్రమాలతో సాగింది.

తెలంగాణ‌లో తొలి స్వ‌లింగ సంప‌ర్కుల జంట‌గా వీరు రికార్డుల్లోకి ఎక్కారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం మ‌న‌దేశంలో చాలా అరుదు. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అలాంటి పెళ్లిళ్లు జరగలేదు. మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు ఇలా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదేం పెళ్లిరా నాయ‌నా అంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.


Next Story