గంగా నదిలో ఒక ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదింది. నిండా మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉన్నాడు. బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘవ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో కాలువలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లోని గంగా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక ఏనుగు, దానిపై ఉన్న మావటివాడు వరద ప్రవాహం వల్ల గంగా నదిలో కొంత దూరం కొట్టుకుపోయారు. అయితే తల వరకు మునిగిన ఆ ఏనుగు నదిలో పూర్తిగా మునిగిపోకుండా సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది.
ఏనుగుపై ఉన్న మావటివాడు దానిని నది ఒడ్డుకు చేర్చేందుకు చాలా ప్రయత్నించాడు. ఒక చోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండటాన్ని మావటివాడు చూశాడు. ఆ దిశగా ఏనుగు ఈదేలా చేశాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఉధృతమైన వరదలో మావటిని అలాగే ఎక్కించుకుని ఏనుగు ఒడ్డుకు చేరుకుంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగు దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయి కనిపించింది.