పూణేలోని బలేవాడికి చెందిన ఒక రైతు మనవరాలు పుట్టడంతో చాలా ఉప్పొంగిపోయి, ఆమెను ఇంటికి స్వాగతించడానికి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. పూణే శివార్లలోని బాలేవాడి ప్రాంతంలో నివసించే అజిత్ పాండురంగ్ బల్వాడ్కర్ విలేకరులతో మాట్లాడుతూ.. తన కుటుంబంలోని కొత్త సభ్యురాలు క్రుషికకు ఘన స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. ఆమె డిసెంబర్ 30న జన్మించిందని తెలిపాడు. మనవరాలు, కోడలును సమీపంలోని షెవాల్ వాడిలోని అమ్మానాన్నల ఇంటి నుండి తన ఇంటికి తీసుకువెళ్లడానికి రైతు హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు.
క్రుషికాను కుటుంబ సభ్యులు స్వాగతిస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. బల్వాడ్కర్, అతని భార్య సంగీతా అజిత్ బల్వాడ్కర్ రెండవసారి తాత, నానమ్మ అయ్యారు. వీరి కుమారుడు కృష్ణ బల్వాడ్కర్, కోడలు అక్షత బల్వాడ్కర్‌లకు మొదట క్రియాంష్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో పూణెలో ఇలాంటి సందర్భమే జరిగింది. ఖేడ్ తహసీల్‌లోని ఒక కుటుంబం తమ నవజాత శిశువును ఇంటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుంది. రాజలక్ష్మి అనే ఆ పాప జనవరి 22న జన్మించింది.
"మా కుటుంబం మొత్తంలో మాకు ఆడపిల్లలు లేరు. కాబట్టి, మా కుమార్తె ఇంటికి వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నాము. అందుకు మేము రూ. 1 లక్ష విలువైన ఛాపర్ రైడ్‌ను ఏర్పాటు చేసాము" అని పాప తండ్రి విశాల్ జరేకర్ చెప్పారు.