లాక్ డౌన్ సమయంలో కరోనా కారణంగా చాలా వరకూ పెళ్లిళ్లు రద్దు అయ్యాయి. ఒకవేళ లాక్ డౌన్ లో పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకున్నా.. చాలా తక్కువ మందితోనే నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో కొందరు పెళ్లిళ్లకు ఎవరినీ ఆహ్వానించకుండా.. ఆన్ లైన్ లో చూసుకోవాలని కోరారు. కొన్ని పెళ్లిళ్లు నవ్వులు కూడా పూయిస్తున్నాయి. ఎందుకంటే వధువు, వరుడు వరమాల వేసుకోడానికి చాలా కష్టాలే పడ్డారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. అందులో అంత కొత్తగా ఏముంది అంటే.. వధువు, వరుడు దండలు మార్చుకునే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం. ఛత్తీస్ఘర్ అడిషనల్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ దీపాంషు కాబ్రా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో వధూవరులు దండలను మార్చుకోడానికి కట్టెలను ఉపయోగించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మాస్కులను వేసుకొని కనిపించారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతూ ఉన్నారు. ఇలా పెళ్లి చేసుకోవడం కంటే ఇంకొద్ది రోజులు వాయిదా వేసుకుంటే బెటర్ కదా అని తమ అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. మరికొందరేమో కోవిడ్ రూల్స్ ను బాగా పాటిస్తున్నారు అని ప్రశంసలు అందించారు.