బైక్ మీద స్టంట్లు చేసిన అమ్మాయిలు.. రూ. 28000 ఫైన్ వేసిన పోలీసులు

Bike stunt costs two women Rs 28,000 after insta video goes viral. తాజాగా అలా బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు స్టంట్స్ చేశారు, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు భారీగా ఫైన్ వేశారు.

By Medi Samrat
Published on : 17 March 2021 5:24 PM IST

Bike stunt costs two women Rs 28,000 after insta video goes viral
కొందరు సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం.. వైరల్ అవ్వడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ వీడియోలు ప్రశంసలు తీసుకుని వస్తే.. ఇంకొన్ని సార్లు లేనిపోని చిక్కులను కూడా తీసుకుని వస్తూ ఉంటాయి. తాజాగా అలా బైక్ మీద ఇద్దరు అమ్మాయిలు స్టంట్స్ చేశారు. కానీ ఆ స్టంట్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు భారీగా ఫైన్ వేశారు.


ఇంతకూ ఆ వీడియోలో ఏముందటే.. ఇద్దరు యువతులు బైక్ మీద వెళుతూ ఉన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ మీద వెళ్లిన సదరు యువతుల్లో.. ఓ యువతి ఎంచక్కా బైక్ ను నడుపుతూ ఉండగా.. మరో యువతి ఏకంగా ఆమె భుజాల మీద ఎక్కి కూర్చుంది. వీరిద్దరూ కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు. రోడ్డు మీద వీరు అలా వెళుతూ ఉండగా.. వెనుక నుండి వీడియో తీశారు. రోడ్డు మీద వెళుతున్న వాళ్లు అలా నోరెళ్ళబెట్టి చూడడం మొదలుపెట్టారు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ పోలీసులు భారీగా ఫైన్ వేశారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు గానూ 28000 రూపాయలు ఫైన్ కట్టాలని కోరారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శివాంగి దబాస్.. రెజ్లర్ స్నేహ రఘువంశీ భుజాలపై అలా కూర్చుంది. గత శనివారం నాడు ఈ వీడియోను తీసినట్లు గుర్తించారు. స్నేహ రఘువంశీ తల్లి మంజు దేవికి 11000 రూపాయల చలానాను ఘజియాబాద్ పోలీసులు పంపారు. ఇక బైక్ ఓనర్ అయినా సంజయ్ కుమార్ కు 17000 రూపాయల చలానా కట్టాల్సిందిగా కోరారు. తామేదో ఆనందం కోసం ఇలాంటి స్టంట్ ను ప్రాక్టీస్ చేసి వీడియోను అప్లోడ్ చేస్తే.. ఇలా భారీ ఫైన్ పడుతుందని అసలు ఊహించలేదని సదరు యువతులు చెప్పుకొచ్చారు.


Next Story