కాలంలో ఎంత మార్పు వస్తున్నా కూడా ఇప్పుడు కూడా అమ్మాయి పుట్టిందని మహిళలపై జరుగుతున్న దాడుల గురించి వింటూనే ఉన్నాం. వారసుడు పుట్టే వరకూ ఆడవాళ్లను వేధిస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఇంకా ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది. కానీ ఓ పానీ పూరీ బండి వ్యక్తి మాత్రం తనకు కూతురు పుట్టిన విషయాన్ని ఎంతో హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన అంచల్ గుప్తా కోలార్ లో స్థానికంగా పానీపూరీ అమ్ముతుంటాడు. అతనికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తనకు అమ్మాయే కావాలని పెళ్లయిన నాటి నుంచి కలలుకంటూనే ఉన్నాడు.

కానీ అతనికి తొలి సంతానంగా రెండేళ్ల క్రితం అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 17న అమ్మాయి పుట్టింది. దీంతో అంచల్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆదివారం తన కుమారుడి రెండో పుట్టినరోజున తనకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా స్థానికులందరికీ ఉచితంగా పానీపూరీ పంచిపెట్టడం విశేషం. దీనికోసం ఏకంగా రూ.50వేలు ఖర్చుపెట్టాడు. సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లలు సమానమని, వివక్షకు తావులేదని చెప్పాలనుకున్నానని అంచల్ గుప్తా తెలిపాడు. అందుకే ఇలా కూతురు పుట్టిందనే సంతోషంతో అందరికీ ఉచితంగా పానీపూరీ పంచిపెట్టానన్నాడు అంచల్.


సామ్రాట్

Next Story