ఒక పులి, అడవి పంది బావిలో పడిపోయాయి. అయితే ఆ సమయంలో పులి పందిని చంపడం కంటే తాను బతకడమే గొప్ప అనుకుని, పక్కనే అడవి పంది ఉన్నా ఏమీ చేయకుండా వదిలేసింది. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని కురై బ్లాక్‌లోని పిపారియా హర్దులి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతం పెంచ్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ కిందకు వస్తుంది. తెల్లవారుజామున, పొలంలో ఉన్న బావిలో పులి, అడవి పంది తేలుతూ ఉండటానికి పోరాడుతున్నట్లు గ్రామస్థులు గమనించారు.
గ్రామస్తులు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. అటవీశాఖ రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని పులిని, అడవిపందిని కాపాడింది. రెస్క్యూ టీమ్ క్రేన్, మంచం ఉపయోగించి బావి నుండి పులిని విజయవంతంగా రక్షించింది. అటవీ శాఖ రెస్క్యూ టీం బావిలో నుంచి రెండు జంతువులను సురక్షితంగా బయటకు తీశారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలానికి నిలయం. 2021లో తీసిన లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 44 పులులు ఉన్నాయి.