16 అడుగుల చేప.. వామ్మో..!
16-Foot Fish Caught. మత్స్యకారుల బృందం ఇటీవల చిలీలో ఏకంగా 16-అడుగుల రాక్షస చేపను పట్టుకుంది.
By Medi Samrat Published on 16 July 2022 11:30 AM GMT
మత్స్యకారుల బృందం ఇటీవల చిలీలో ఏకంగా 16-అడుగుల రాక్షస చేపను పట్టుకుంది. క్రేన్ ద్వారా ఆ జీవిని పైకి లేపిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. క్లిప్‌లో పొడవాటి చేపను తలపై కట్టిపడేసినట్లు చూపిస్తుంది. డైలీ స్టార్ ప్రకారం, ఓర్‌ఫిష్‌గా గుర్తించబడిన ఈ చేప ఐదు మీటర్ల కంటే ఎక్కువ పొడవు (16 అడుగులు) ఉంటుంది.
ఈ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. టిక్‌టాక్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది. ఈ జీవిని సునామీలు, భూకంపాలకు ముందు వచ్చే చెడ్డ శకునంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ వార్త ప్రజలలో ఆందోళనలను పెంచింది. ఓర్ ఫిష్ సాధారణంగా చాలా లోతులో నివసిస్తుంది. అవి ఉపరితలంపైకి వచ్చాయంటే టెక్టోనిక్ ప్లేట్లు కదలికలు వచ్చి ఉంటాయని భావించవచ్చు. ఈ జీవి ఒడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల నీటి అడుగున భూకంపాలు వచ్చే అవకాశం ఉందని ఇంటర్నెట్ వినియోగదారులు విశ్వసిస్తున్నారు.
ఓర్ ఫిష్ 11 మీటర్ల పొడవు కూడా అవ్వగలదు. సాధారణంగా సముద్రంలో ఎంతో లోతులో నివసిస్తూ ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడో, చనిపోయే సమయంలోనో లేదా సంతానోత్పత్తి చేసే సమయంలో మాత్రమే ఉపరితలంపైకి తిరిగి వస్తాయి. ఈ చేపను గుర్తించడం చాలా అరుదు. ఏప్రిల్‌లో, న్యూజిలాండ్‌లోని ఒక బీచ్‌లో ఓర్‌ఫిష్ కనుగొనబడింది.