మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు.. ఆ రాష్ట్రాలు క్లారిటీ ఇచ్చేశాయ్‌..!

By సుభాష్  Published on  15 Jun 2020 12:40 PM GMT
మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు.. ఆ రాష్ట్రాలు క్లారిటీ ఇచ్చేశాయ్‌..!

దేశంలోకరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. దేశంలో కొత్తగా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారత్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.

ఢిల్లీలో..

క్రమంలో తమ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగినా.. మళ్లీ లాక్‌డౌన్‌ విధించేది లేదని ఆయా రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కరోనాపై అఖిల పక్ష సమావేశం జరిగిన కొద్దిసేపటికే ఢిల్లీ సీఎం ఈ ట్వీట్‌ చేశారు.

గుజరాత్‌లో..

ఇక గుజరాత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని కొట్టిపారేశారు. మా రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు సోషల్‌ మీడియాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అలాంటివేమి నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.

జూన్‌ 1 నుంచి నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో పరిశ్రమలు, ఆయా కార్యాలయాలు, బస్సులు, ఆటోలకు అనుమతి ఇవ్వడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

మహారాష్ట్రలో..

ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే కూడా మళ్లీ లాక్‌డౌన్‌ విధింపుపై స్పందించారు. మా రాష్ట్రంలో అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున చెన్నైతో పాటు చెంగల్‌ పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ కఠినంగా ఉంటుందని ముఖ్యమంత్రి పళని స్వామి తెలిపారు.



Next Story