నిర్లక్ష్యానికి సూత్రధారులు ఎవరు.?

By సుభాష్  Published on  1 April 2020 10:12 AM GMT
నిర్లక్ష్యానికి సూత్రధారులు ఎవరు.?

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తూ.. చాపకింద నీరులా అన్ని దేశాలకు పాకింది. భారత్‌ నిన్న మొన్నటి వరకూ కరోనా కట్టడిలో అద్భుతంగా ఉందంటూ ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ ఆ ప్రశంసలు మరువకుండానే భారత్‌లో కరోనా కల్లోలం రేపింది. ఢిల్లీ మర్కజ్‌ మతప్రార్థనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక తెలంగాణలో మరణించిన ఆరుగురు వ్యక్తులంతా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారేనని, వీరంతా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారని నిర్దారణ అయింది. తెలంగాణలో కరోనా కేసులు పెద్దగా లేవని, లాక్‌డౌన్‌ ముగిసే లోపు కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారితో కలకలం మొదలైంది. దేశ వ్యాప్తంగా కరోనా లింకులన్నీ మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైన వారివేనని స్పష్టమైంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై తెగ చర్చ జరుగుతోంది. దీనంతటికి కారణం ఎవరు..? ప్రధాన సూత్రధారులు ఎవరంటూ నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్లక్ష్యానికి కారకులెవరని ఆరా తీస్తోంది.

చైనాలోని వూహాన్‌ నగరంలో ఈ వైరస్‌ బయటపడ్డాక మెల్లమెల్లగా ప్రపంచ దేశాలకు పాకింది. జనవరి చివరి వారం నుంచి అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ ప్రమాద ఘంటికలు ఫిబ్రవరి చివరి వారం నాటికి మరింత తీవ్రతరం అయ్యాయి. ఇక మార్చి రెండో వారం నాటికి సామాజిక దూరం పాటించాలని, అందరూ గుంపులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు పాటిస్తూ, లాక్‌డౌన్‌ అమలు చేయాలని కేంద్ర సర్కార్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి దశలో సమావేశాలను సైతం వాయిదా వేసుకోవాలని నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ నిర్వాహకులు ఎలాంటి ఆలోచనలు చేయకుండా సమావేశాలు కొనసాగించారు. ఈ ప్రార్థనలకు దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి మతప్రచారకులు హాజరయ్యారు. అదీ కూడా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దేశాల నుంచే అధిక సంఖ్యలో హాజరు కావడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

వేలాది మందితో నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 1 నుంచి కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించే వరకు కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర నిఘా వ్యవస్థ, ఢిల్లీ ప్రభుత్వ నిఘా వ్యవస్థ నుంచి తప్పించుకుని సమావేశాలు సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా బాధిత దేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌కు తరలించకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తే, ఇక రాష్ట్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని ప్రజలు మండిపడిపోతున్నారు. ఢిల్లీలోని మర్కజ్‌ నిర్వాహకులు, అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా దక్షిణాధి రాష్ట్రాల్లో మరణ మృదంగానికి కారణంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టకున్నట్లు.. కరోనా నష్టం జరిగిన తర్వాత నిజాముద్దీన్‌ మర్కజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈ ప్రార్థనలు నిర్వహిస్తున్న మత పెద్ద కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నిర్లక్ష్యం కారణంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న వైద్య విభాగానికి శాపంగా మారింది.

Next Story