ఏపీలో ఆ ఒక్క జిల్లాలో ఒకే రోజు 14 కరోనా కేసులు..!

By సుభాష్  Published on  1 April 2020 3:58 AM GMT
ఏపీలో ఆ ఒక్క జిల్లాలో ఒకే రోజు 14 కరోనా కేసులు..!

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ అన్ని దేశాలకు చాపకింద నీరులా వ్యాపించింది. ఇక భారత్‌లో కూడా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో ఒక్కసారిగా 15 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏపీలో మాత్రం అధికారికంగా 40 కేసులుంటే, అనధికారికంగా 58 వరకు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో తీవ్ర భయాందోళన వ్యక్తం అవుతోంది.

సోమవారం వరకూ ఒక్క పాజిటివ్‌ కేసు రాకపోగా, అలాంటిది ఇప్పుడు ఏకంగా 14 కేసులు నమోదయ్యాయి. జల్లా కేంద్రమైన ఏలూరులో 8, భీమవరంలో 2, గుండుగోలనులో 1, ఉండిలో 1, పెనుగొండలో 1 కేసు పాజిటివ్‌ కేసు చొప్పున నమోదైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే నిజమైతే ఏపీలో అధికంగా కేసులు నమోదైన పశ్చిమగోదావరి జిల్లాగా ఉంటుంది.

ఇన్ని కేసులు ఒక్కసారిగా నమోదు కావడం వెనుక ఢిల్లీ ప్రార్థనలేనని అంటున్నారు. ఆ ప్రార్థనల్లో పాల్గొన్న కొందరికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నాయని, అందుకే కేసుల సంఖ్య ఒక్కసారిగా నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు పెద్ద ఎత్తున తరలివెళ్లినట్లు తెలుస్తోంది.

కాగా, ఆ 14 మంది ఎక్కడెక్కడ తిరిగారనే దానిపై ఏపీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వివరాలు దాచిపెడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అందుకే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story
Share it