దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఎనిమిదేళ్ల త‌ర్వాత‌ ఉరిశిక్ష పడింది. ఈ రోజు ఉద‌యం 5:30 గంటలకు ఢిల్లీలోని తీహార్‌ సెంట్రల్‌ జైలులోని జైలు నెంబర్‌-3లో వారిని ఉరితీశారు. 2012 డిసెంబర్‌ 16 ఢిల్లీలో కదులుతున్న బస్సులో మెడికల్‌ స్టూడెంట్‌ నిర్భయపై ఆరుగురు మృగాళ్ల లైంగిక దాడి చేసి.. అతి కిరాతకంగా చంపేశారు. అడ్డువ‌చ్చిన నిర్భ‌య స్నేహితుడిపై దాడి చేసి దారుణంగా గాయ‌ప‌రిచారు.

అయితే, ఈ కేసులో రామ్‌సింగ్ అనే ప్రధాన నిందితుడు.. జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి మైనర్‌ అని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. దీంతో.. కోర్టు అతనికి జువైనల్‌ యాక్ట్‌ కింద జైలు శిక్ష విధించి.. అనంత‌రం విడుదల చేసింది. అయితే.. ప్రస్తుతం అతను దక్షిణ భారత దేశంలో.. రహస్య జీవితాన్ని​ గడుపుతున్నట్టు స‌మాచారం. ఓ వంట‌వాడిగా జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తుంది.
ఇదిలావుంటే.. ఢిల్లీకి సుమారు 200మైళ్ల‌ దూరంలో ఉండే ఆ మైనర్‌కు.. ప్ర‌ధాన నిందితుడైన‌ బ‌స్సు ఓన‌ర్ రామ్ సింగ్‌.. క్లీన‌ర్‌గా ఉద్యోగం ఇచ్చాడు. 11 ఏళ్ల‌కే ఇంట్లో నుండి వ‌చ్చేసిన‌ ఆ మైన‌ర్‌ను రామ్ సింగ్ చేర‌దీశాడు. కాగా, నిర్భయ ఘటన సమయంలో మైనర్‌ కూడా బ‌స్సులోనే ఉన్నాడు. అతను కూడా నిర్భ‌య‌పై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అయితే.. రేప్ కేసులో దోషిగా తేలిన ఆ మైన‌ర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు. ఆ త‌ర్వాత అత‌న్ని విడుద‌ల‌ చేశారు.
అయితే, అత‌న్ని విడుద‌ల చేసిన త‌ర్వాత మాత్రం.. ఢిల్లీకి దూరంగా పంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక ఎప్పుడూ ఆ మైన‌ర్ ముఖంపై గుడ్డ‌ క‌ప్పిఉంచడం వ‌ల్ల అత‌నిని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేరు. అత‌ని గుర్తులేవి.. ఎవ‌రికీ తెలియ‌దు. కానీ.. అత‌నిపై ఎప్పుడూ పోలీసుల నిఘా మాత్రం ఉంటుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.