నిర్భయ లాయర్‌ ఫీజు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

By సుభాష్  Published on  20 March 2020 8:46 AM GMT
నిర్భయ లాయర్‌ ఫీజు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీశారు. వారికి శిక్ష అమలు కోసం నిర్భయ కుటుంబమే కాకుండా దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. నిర్భయ తల్లి ఆశాదేవి అయితే 2013 నుంచి ఇప్పటి వరకు తన కుమార్తెకు న్యాయం జరగాలని పోరాడుతూనే ఉంది. ఇక ఆమె వెంట అండగా ఉంటూ, వారి తరపున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక వైపు దోషులు న్యాయ వ్యవస్థలోని లొసుగులను అడ్డంపెట్టుకుంటూ శిక్షను వాయిదా వేసుకుంటూ వచ్చారు. కానీ దోషులను ఎలాగైన ఉరికంబం ఎక్కించే వరకు వదిలిపెట్ట లేదు ఆ మహిళా న్యాయవాది. ఆమె పేరే సిమా ఖుష్వాహ. దోషులకు ఉరిశిక్ష వాయిదా పడినప్పుడల్లా నిర్భయ తల్లి వెన్నంటి ఉంటూ ధైర్యం నింపింది.

2012లో నిర్భయ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు నిర్భయ కుటుంబానికి ఖుష్వాహ అండగా నిలుస్తూ వచ్చింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, చార్జ్‌షీట్‌ నమోదు చేయడం, ఇతర విషయాల్లోనూ ఆమె ముందుంటూ నిర్భయ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వచ్చింది. ఆ న్యాయవాది సపోర్ట్‌ నిర్భయ కుటుంబానికి ఎల్లవేళల ఉంది. సాధారణంగా దోషుల తరపున గానీ, బాధితుల తరపున గానీ న్యాయవాదిని పెట్టుకుంటే ఫీజు భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీ హైకోర్టులో నిర్భయ కేసుపై సమర్ధవంతంగా వాదించిన ఆమె ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. కేవలం తన స్నేహితురాలికి సాయం చేస్తున్నానని అనుకుందట.

ఇక చివరికి దోషులకు ఉరి వేయడంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. కాగా, న్యాయవాది సీమా ఖుష్వాహా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యురాలిగా ఉన్న సీమా.. ఈ కేసులో సుప్రీం కోర్టు వరకు వెళ్లారు.

Next Story