పుల్వామా సూసైడ్ బాంబర్ కు మొబైల్ ఫోన్ ఇచ్చిన వ్యక్తి దొరికాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2020 2:02 PM ISTశ్రీనగర్: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్.ఐ.ఏ.) పుల్వామా సూసైడ్ బాంబర్ కు మొబైల్ ఫోన్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో చోటుచేసుకున్న బాంబు దాడిలో నలభై మంది సీఆర్పీఎఫ్ జవానులు అసువులు బాసారు. ఈ ఘటన యావత్ భారతాన్ని కదిలించి వేసింది.
ఈ ఘటనకు బాధ్యుడైన సూసైడ్ బాంబర్ కు మొబైల్ ఫోన్ అందించిన బిలాల్ అహ్మద్ కుచాయ్ ను అదుపులోకి తీసుకున్నామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. పుల్వామా జిల్లాలోని హజిబాల్, కాకపోరా ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని స్పెషల్ ఎన్.ఐ.ఏ. కోర్టులో అతడిని ప్రవేశపెట్టారు. పది రోజుల పాటూ రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఎన్.ఐ.ఏ. అరెస్టు చేసిన ఏడో వ్యక్తి ఇతను.
బిలాల్ అహ్మద్ స్థానికంగా ఓ మిల్లు ఓనర్.. టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి. పుల్వామా దాడికి బాధ్యులైన జైష్-ఏ-మొహమ్మద్ మిలిటెంట్లకు ఎన్నో సార్లు సరకుల రవాణా చేసాడని ఎన్.ఐ.ఏ. చెబుతోంది. ఈ అటాక్ కు ప్లానింగ్ చేసే సమయంలో బిలాల్ అహ్మద్ తన ఇంటిలో తీవ్రవాదులకు షెల్టర్ ఇచ్చాడని ఎన్.ఐ.ఏ. అధికారులు భావిస్తూ ఉన్నారు. బిలాల్ అహ్మద్ తీవ్రవాదులకు హై ఎండ్ మొబైల్ ఫోన్ లను అందించాడని.. ఆ మొబైల్ ఫోన్ ల ద్వారా పాకిస్థాన్ లో ఉన్న తీవ్రవాద నేతలతో ఇక్కడి వారు కమ్యూనికేట్ చేసుకున్నారు. ప్లాన్ వివరాలను తెలపడమే కాకుండా అటాక్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలను చివరి వరకూ ఆ మొబైల్ ఫోన్ లలోనే చర్చించినట్లు తెలుస్తోంది.
జెఈ ఎం కేడర్ కు చెందిన అదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ కమాండో తన స్టేట్మెంట్ ను బిలాల్ అహ్మద్ ఇచ్చిన మొబైల్ ఫోన్ ద్వారానే రికార్డు చేశారు. ఆ తర్వాత అహ్మద్ దార్ పేలుడు పదార్థాలు నిండిన మారుతి ఈకో వాహనాన్ని తీసుకుని సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దూసుకుని వెళ్ళాడు. వెంటనే భారీ పేలుడు సంభవించి సీఆర్పీఎఫ్ జవానులు మరణించారు.
మార్చి నెలలో పీర్ తారిఖ్ అహ్మద్ షా, అతని కుమార్తె 26 సంవత్సరాల ఇన్షా జాన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫర్నీచర్ షాపు ఓనర్ అయిన షాకీర్ బషీర్ మాగ్రేను కూడా ఎన్.ఐ.ఏ. అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదిల్ అహ్మద్ దార్ కు కొన్ని వస్తువులను సరఫరా చేయడమే కాకుండా షెల్టర్ కూడా వీళ్ళు ఇచ్చినట్లు అనుమానిస్తూ ఉన్నారు.
పుల్వామా ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు మొదట్లో విచారణ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కేసును ఎన్.ఐ.ఏ.కు బదలాయించింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. జమ్మూ కాశ్మీర్ పోలీసులు పుల్వామా లోని కాకపోరా నివాసి అయిన సమీర్ అహ్మద్ దార్ ను జనవరి 31న అదుపులోకి తీసుకోగా.. ఆ తర్వాత ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తీవ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని కూడా బాగా కూపీ లాగారు పోలీసులు.