భారత్‌ - చైనా ఘర్షణ: గాల్వన్‌ లోయలో 100 మంది చైనా జవాన్లు చనిపోయారా..?

By సుభాష్  Published on  7 July 2020 12:33 PM GMT
భారత్‌ - చైనా ఘర్షణ: గాల్వన్‌ లోయలో 100 మంది చైనా జవాన్లు చనిపోయారా..?

ముఖ్యాంశాలు

  • సంచలనంగా మారిన కపిల్ మిశ్రా ట్వీట్

  • చైనాలో సంచలనం రేపుతున్న యాంగ్‌ జినాలి వ్యాఖ్యలు

జూన్‌ 15న భారత్‌ - చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షలో భారత్‌కు చెందిన 21 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. అయితే చైనాకు చెందిన ఆర్మీ జవాన్లు ఎంత మంది చనిపోయారనేది ఇప్పటి వరకు లెక్క తేలలేదు. చైనా ప్రభుత్వం కూడా ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఇక అంతర్జాతీయ మీడియా కథనాలు మాత్రం 43 మంది చైనా ఆర్మీ జవాన్లు మృతి చెందినట్లు పేర్కొన్నాయి. మరికొన్ని పత్రికలు 45 మంది వరకు చనిపోయారని పేర్కొన్నాయి. ఇక ఆ విషయం అటుంచితే మరో అంశం వైరల్‌గా మారింది.

తాజాగా చైనా నుంచే అసలు లెక్కలు బయటకు వచ్చాయి. జూన్‌ 15న లడఖ్‌లోని గాల్వన్‌ లోయలో జరిగిన రెండు దేశాల సైనికుల ఘర్షణలో చైనాకు చెందిన 100 మంది చనిపోయారని ఆ దేశానికి చెందిన ఒకరు చెప్పినట్లు బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా సోమవారం సంచలన పోస్టును ట్వీట్‌ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.



చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సిపిసి) మాజీ నాయుడి కుమారుడు యాంగ్‌ జినాలి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ కపిల్‌ మిశ్రా తెలిపారు. చైనా సర్కార్‌ వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించిన యాంగ్‌ జినాలి.. గాల్వన్‌ వ్యాలీలో అసలు ఏం జరిగినా చైనా ప్రభుత్వం నుంచి బయటకు రాదని అన్నారు. భారత్‌ భూభాగంలోకి చైనా సైన్యం వెళ్లిన తర్వాత పెద్ద యుద్ధమే జరిగిందని, ఈ యుద్ధంలో వంద మందికిపైగా చైనా సైనికులు మరణించారని ఆయన వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా.. అక్కడి పరిస్థితులు భారత్‌కే అనుకూలమన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చైనాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి.

ఇంతకి జినాలి ఎవరు..?

అయితే యాంగ్‌ జినాలి ఎవర్న విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా మాజీ నాయకుడి కుమారుడు యాంగ్‌ జినాలి. ఇతను ప్రస్తుతం టియానన్మెన్‌ స్క్వేర్ కార్యకర్తగా పని చేస్తున్నారు. అలాగే ఎలాంటి లాభపేక్ష లేని చైనా కోసం సిటిజెన్‌ పవర్‌ ఇనిషియేటివ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నాడు. ప్రస్తుతం యూఎస్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే గాల్వన్‌ ఘర్షణకు సంబంధించి వాస్తవాలపై గత వారం 'ది వాషింగ్టన్‌ టైమ్స్‌' లో తన అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేశారు. చైనా భారీగా సైనికులను కోల్పోయిందని చెప్పుకోవడానికి భయపడుతోందని చెప్పుకొచ్చారు.

అయితే బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రాతో పాటు అనేక ఇతర ట్విట్టర్‌ వినియోగదారులు గాల్వన్‌ ఘర్షణలో వంద మంది చైనా సైనికులు మరణించినట్లు ట్వీట్‌ చేసినట్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే జాతీయ, అంతర్జాతీయంగా మీడియా కథనాల్లో వచ్చిన లెక్కలే తప్ప చైనా మాత్రం ఎంత మంది చనిపోయారన్నది అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు.



Next Story