నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆరా తీసిన 'ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు'

By Newsmeter.Network  Published on  7 Dec 2019 5:59 PM IST
నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆరా తీసిన ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను నిన్న ఘటన స్థలానికి తీసుకువచ్చి విచారిస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పోలీసులపై రాళ్లురువ్వడంతో, వారిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. నిందితుల మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించి, వారి వారి కుటుంబీకులకు అప్పగించే క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. మృతదేహాలను 9వ తేదీ వరకు భద్రపర్చాలని ఆదేశించింది.

ఈ మేరకు తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ ఆర్‌సీ బృందం నోటీసులు జారీ చేసింది. ఈకేసుపై తాము విచారిస్తామన్న నేపథ్యంలో ఈ రోజు మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం రిపోర్టును ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం పరిశీలించింది. మృతదేహాల మీద ఉన్న బుల్లెట్ల గాయాల‌ను పరిశీలించింది. అనంత‌రం గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చిన ఫోరెన్సి నిపుణులు కూడా పోస్టుమార్టం రిపోర్టును పరిశీలించారు. అలాగే బృందాలు ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ ఇతర డాక్యుమెంట్లను కూడా పరిశీలించాయి.

అంతేకాకుండా.. ఆస్పత్రికి వచ్చిన నిందితుల కుటుంబ సభ్యుల నుంచి ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు పలు వివరాలు సేకరించారు. అలాగే దిశను అత్యాచారం, హత్య చేసిన స్థలాలాలను పరిశీలించారు. అనంతరం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన, అత్యాచారం,హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘటనకు సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరఫున తనను మాట్లాడమన్నారని పేర్కొన్నారు.

Next Story