ఉన్నావ్ బాధితురాలు మృతి..!

By అంజి  Published on  7 Dec 2019 4:03 AM GMT
ఉన్నావ్ బాధితురాలు మృతి..!

తనపై అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించే తీరాలంటూ పోలీసుల చుట్టూ తిరిగిన ఉన్నావ్ బాధితురాలు చివరికి తన కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోయింది. దిశ హత్యాచారం కేసు ఎన్‌కౌంటర్‌ జరిగిన శుక్రవారానికి ఒక్కరోజు ముందు... ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలిపై నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. గత రెండ్రోజులుగా ఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న ఆమె గత రాత్రి 11.40కి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మన దేశంలో అమ్మాయిలకు సరైన రక్షణ లేదని చెప్పేందుకు ఉన్నావ్ రేప్ కేసు మరో తాజా ఉదాహరణ. ఎంత ఘోరం అంటే... తనపై రేప్ చేసిన వాళ్లను శిక్షించండి మహాప్రభో అంటూ న్యాయ పోరాటం చేస్తున్న ఆమెకు న్యాయం జరగలేదు సరి కదా... ఏకంగా అదే నిందితుల చేతిలో ఆమె మరోసారి దాడికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

Img 20191207 064842

ఉన్నావ్‌కు చెందిన బాధితురాలిని పెళ్లి పేరుతో నమ్మించిన నిందితుడు, అతని స్నేహితునితో కలసి గత డిసెంబరులో అత్యాచారం చేసాడు. అప్పటి నుంచీ ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్తున్న ఆమెను ప్రధాన నిందితులు శివం త్రివేది, శుభం త్రివేదిలతోపాటు రామ్‌కిశోర్‌ త్రివేది, ఉమేశ్‌ బాజ్‌పాయి, హరిశంకర్‌ త్రివేదిలు దారిలో అడ్డుకున్నారు. ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బాధితురాలు కేకలు వేస్తూ కిలోమీటరు దూరం పరుగులు తీసింది. సమాచారం అందుకొని బాధితురాలిని చేరుకున్న పోలీసులు ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె గతరాత్రి ప్రాణాలు విడిచింది. దురదృష్టం ఏంటంటే... ఆమెపై అత్యాచారం చేసి, తాజాగా కిరోసిన్ పోసి నిప్పంటించిన దుర్మార్గులు మాత్రం ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

Img 20191207 064839

ప్రస్తుతానికి ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటైంది. ఐదుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయిస్తామని ప్రకటించింది. ఇదేదో బాధితురాలు బతికున్నప్పుడు, కోర్టులవెంట తిరిగినప్పుడు జరగీతే బాగుండేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Next Story
Share it