దివ్య తేజస్విని గొంతు నేను కోయలేదు : నాగేంద్ర
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2020 2:57 PM ISTతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య కేసు మరో మలుపు తిరిగింది. దివ్య తేజస్విని గొంతు తాను కోయలేదని స్వామి అలియాస్ నాగేంద్ర తెలిపాడు. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని.. ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని అన్నాడు.
ప్రేమోన్మాది దాడి అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో.. ఇద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. లాక్ డౌన్ సమయంలో పెళ్లి కూడా చేసుకున్నట్లు నాగేంద్ర తెలిపాడు. తేజస్వినితో 13ఏళ్లుగా పరిచయం ఉందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని అన్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలుసని, కులాలు వేరు కావడంతో తేజస్విని కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదని.. దీంతో రహస్యంగా వివాహం చేసుకున్నామని నాగేంద్ర చెప్పాడు.
పెళ్లి విషయం కూడా తేజస్విని తల్లిదండ్రులకు తెలుసని.. దీనిపై గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతుందని నాగేంద్ర తెలిపాడు. దీంతో తేజస్వినీని ఆమె కుటుంబ సభ్యులు ఇంట్లో నిర్బంధించి బయటకు రాకుండా చేశారని, ఈ నేపథ్యంలో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకుని నిన్న ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నామని నాగేంద్ర తెలిపాడు. ఆ తర్వాత తాను స్పృహ తప్పి పడిపోయానని, తర్వాత తన చేతికి ఎలా గాయం అయ్యిందో తెలియదని చెప్పాడు.
ఇదిలావుంటే.. దివ్యతో నాగేంద్రకు రహస్య వివాహం జరిగిందన్న నిందితుడి వాదనలో నిజం లేదని.. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దివ్య తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం తమతో చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.