విజయవాడ: దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్‌

By సుభాష్  Published on  16 Oct 2020 4:12 AM GMT
విజయవాడ: దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్‌

విజయవాడలో దివ్య హత్య కేసు సంచలనం రేపుతోంది. మరో వైపు ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు నాగేంద్రబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాగేంద్రబాబు ఇంకా స్పృహలోకి రాలేదని వైద్యులు చెబుతున్నారు. 48 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. కత్తితో పొడుచుకోవడంతో నాగేంద్రబాబు కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. దివ్యకు, తనకు పెళ్లి జరిగిందని నాగేంద్రబాబు ఇప్పటికే పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దాని ఆధారంగానే మాచవరం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు దివ్య తేజస్విని అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దివ్య, నాగేంద్రబాబు పెళ్లి చేసుకున్నారని ఇటు నాగేంద్రబాబు సోదరుడు చెబుతుండగా, మా అమ్మాయి ఎవరినీ ప్రేమించలేదని,పెళ్లి చేసుకోలేదని దివ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నాగేంద్రబాబే స్వయంగా తన పెళ్లి గురించి చెప్పాడని అతని సోదరుడు చెబుతున్నాడు.

ఇదిలావుంటే.. నాగేంద్రబాబుతో ప్రేమ, పెళ్లి విషయాన్ని దివ్య తల్లి ఖండిస్తోంది. బీటెక్‌ చదివిన తన కుమార్తె .. పెయింటర్‌గా పని చేసుకునే నాగేంద్రతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. వాళ్లిద్దరికి పెళ్లి జరిగిందని అబద్దాలు చెబుతున్నారని, అలాంటి పుకార్లు పుట్టించవద్దని తల్లి వేడుకుంటోంది. ఇదిలా ఉంటే వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటో సైతం బయటకు వచ్చింది. ఆ ఫోటోలో దివ్య మెడలో తాళి బొట్టు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లిద్దరూ అంత సన్నిహితంగా ఉండి సెల్ఫీ దిగడం, ఆమె మెడలో తాళి ఉండటం చూస్తుంటే వివాహం జరిగే ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నాగేంద్రబాబును దిశ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా, దివ్య ఇంట్లోనే కత్తితోనే ఆమెనుహత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Next Story
Share it