ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీపై నిరసనలు జ్వాలలు పెరిగిపోతుండడంతో.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఎన్‌ఆర్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకోలేదని మంగళవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా కేంద్రహోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సమాధానం చెప్పారు.

కాగా సోమవారం రోజున లోక్‌సభలో సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌లపై సమవేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. వెంటనే ఈ బిల్లును కేంద్ర ఉపసంహరించుకోవాలని విపక్షాలు గొంతు వినిపించాయి. సభ ప్రారంభానికి ముందే విపక్షాలు స్పీకర్‌కు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై స్పీకర్‌ చర్చకు అనుమతించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సీఏఏపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి.

దేశ వ్యాప్తంగా గత కొంత కాలం సీఏఏ, ఎన్‌ఆర్సీలపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ రెండు చట్టాల వల్ల దేశంలో గొడవలు జరిగే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు వివరణ ఇచ్చింది. పక్క దేశాల నుంచి వచ్చే మైనార్టీల కోసమే ఈ చట్టాలను తీసుకోచ్చామని తెలిపాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్సీని చేపడతామని గతేడాది కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా ఓ సమావేశంలో అన్నారు. అక్రమ వలసదారులను.. వారి సొంత దేశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటామని షా ప్రకటించారు. కాగా ఇవాళ లోక్‌సభ సాక్షిగా కేంద్రమంత్రి నిత్యానంద్ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్సీ దిశగా కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.