ఏపీ, తెలంగాణలను కాపీ కొడుతున్న పంజాబ్
By రాణి Published on 4 Feb 2020 7:36 AM GMTపంజాబ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి పాఠాలు నేర్చుకుంటోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జైళ్లను సంస్కరణ కేంద్రాలుగానే కాదు, ఆర్ధికాదాయ వనరులు గానూ మార్చడం జరిగింది. జైలు ఖైదీలకు వివిధ వృత్తులు, కళలను నేర్పించి వారు తయారు చేసిన వస్తువులను అమ్మి లాభాలను ఆర్జిస్తున్నాయి మన తెలుగు కారాగారాలు. తువాళ్లు, దుప్పట్లు, చిన్న చిన్న గృహోపకరణాలను తయారు చేసి, ఖైదీలు వాటిని ప్రజలకు అమ్ముకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఖైదీలు ఒక పెట్రోల్ పంపును కూడా చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు మన తెలుగు మోడల్ ను పంజాబ్ జైళ్లలోనూ అమలు చేయాలనుకుంటోంది అక్కడి జైళ్ల శాఖ. అక్కడ పంజాబ్ జైల్ డెవలప్ మెంట్ బోర్డు పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి, బేకరీ ఐటమ్స్, సాఫ్ట్ టాయ్స్, రజాయిలు, దుప్పట్లు, ఆవనూనె, ఇంటర్ లాకింగ్ టైల్స్ వంటివి ఉత్పాదన చేయాలని నిర్ణయించారు. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం ఖర్చుపెట్టనున్నారు. ఈ ఉత్పాదనలన్నింటికీ పీ జే అంటే పంజాబ్ జైల్స్ అన్న మార్కింగ్ ఉంటుంది. వీటినే బ్రాండ్లుగా ఎదిగేలా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ పథకం ప్రకారం భటిండా జైలులో ఆవనూనె, ఇంటర్ లాకింగ్ టైల్స్ తయారు చేయనున్నారు. అలాగే లుఢియానా మహిళా జైలు ఖైదీలు శానిటరీ నాప్ కిన్స్ తయారు చేస్తారు. అమృతసర్ కార్పెట్లు, సాఫ్ట్ టాయ్స్ తయారు చేయనుంది. ఫిరోజ్ పూర్ జైల్ మంచి నాణ్యత కలిగిన దుప్పట్లు, కార్పెట్లు తయారు చేస్తుంది. ఇక కపూర్తలా జైలులోనైతే ఏకంగా ఎల్ ఈ డీ బల్బుల తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక జైలు బ్రాండ్ ను ఎంత పాపులరైజ్ చేయబోతున్నారంటే ఇక రాబోయే రోజుల్లో పంజాబీలు ఏం కొనాలన్నా జైలుకే వెళ్లడం ఖాయం.