నూత‌న విద్యా విధానానికి కేంద్రం ఆమోదం.. భారీ మార్పులు

By సుభాష్  Published on  29 July 2020 6:59 PM IST
నూత‌న విద్యా విధానానికి కేంద్రం ఆమోదం.. భారీ మార్పులు

దేశ‌వ్యాప్తంగా విద్యా వ్య‌వ‌స్థ‌లో స‌రికొత్త మార్పులు తీసుకువ‌స్తున్న‌ట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు నూత‌న జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. తాజాగా జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో ఈ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మాన‌వ వ‌న‌రుల శాఖ పేరును విద్యాశాఖ‌గా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పాఠశాల, కళాశాల వ్యవస్థలో భారీ మార్పులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. నూత‌న విద్యా విధానంలో భాగంగా మూడు సంవ‌త్స‌రాల నుంచి 18 ఏళ్ల వ‌ర‌కు విద్య‌ను కేంద్రం త‌ప్ప‌నిస‌రి చేసినట్లు తెలిపారు.విద్యార్థుల‌పై భారం త‌గ్గించాల‌నేది నూతన విధానం ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేసింది కేంద్రం. 2030 నాటికి అంద‌రికీ విద్య అందించాల‌నేదే త‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని తెలిపారు.

అలాగే ప్ర‌స్తుతం ఉన్న విద్యా విధానంలో కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చింది. కొత్త‌గా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్ర‌కారం.. ప్ర‌స్తుతం ఉన్న 10+2+3 (టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ) విధానాన్ని 5+3+3+4 మార్చారు. ప్రాథ‌మిక విద్య‌కు దేశ వ్యాప్తంగా ఒకే విద్యా విధానం అమ‌లు చేయ‌నున్నారు. కొత్త విధానంలో ఇంట‌ర్ విద్య‌ను ర‌ద్దు చేసి డిగ్రీ విద్య‌ను నాలుగేళ్లుగా మార్పు చేశారు. ఆరో త‌ర‌గ‌తి నుంచే వొకేష‌న్ కోర్సుల‌ను తీసుకురానున్నారు. విద్యార్థుల‌పై పాఠ్యాంశాల భారం త‌గ్గించి బోధించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

అయితే 3 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఉచిత, నిర్బంధ విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నూతన విద్యా విధానాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త విద్యా విధానంలో సిలబస్‌ వంటి అంశాలు కూడా పూర్తిగా మారిపోనున్నట్లు తెలుస్తోంది. వృత్తి, ఉపాధి లభించే విధంగా విద్యా వ్యవస్థను మార్చనున్నట్లు సమాచారం. ఈ విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్‌ కోర్సుగా పరిగణిస్తారని, ఆ తర్వాత మూడేళ్లను ప్రీ ఫ్రైమరీ స్కూల్‌ మరియు గ్రేడ్‌- 1, గ్రేడ్‌- 2గా పరిగణించనున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర స్థాయి స్కూల్‌ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత 1992లో దాన్ని స‌వ‌రించారు.

విద్యా విధానంలో మార్పులు ఇలా...

► 3 నుంచి 18 ఏళ్ల వ‌ర‌క‌కు అంద‌రికి విద్య త‌ప్ప‌నిస‌రి

► 6వ త‌ర‌గ‌తి నుంచి కోడింగ్‌, ప్రోగ్రామింగ్ కరికుల‌మ్‌

► 6వ త‌ర‌గ‌తి నుంచి వొకేష‌న‌ల్ ఇంటిగ‌రేష‌న్ కోర్సులు

► ప్ర‌స్తుతం 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం

► డిగ్రీ విద్య‌ను మూడు నుంచి నాలుగేళ్లు పొడిగింపు

► పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు

► ఇంట‌ర్ విద్య ఉండ‌దు

► ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు

► దేశ వ్యాప్తంగా ప్రాథ‌మిక విద్య‌కు ఒక‌టే క‌రికుల‌మ్‌

► పాఠ్యాంశాల భారం త‌గ్గించే విధానం

► ఇక నుంచి క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల విద్యాల‌య కేవ‌లం 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే



Next Story