ఉత్తరప్రదేశ్‌లో తొలి జికా వైరస్ కలకలం రేపుతోంది. కాన్పూర్‌లోని పోఖాపూర్‌లో నివసిస్తున్న ఓ వాయుసేన అధికారికి జికా వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. రోగి నమూనాలను పరీక్షల నిమిత్తం పూణెకు పంపించారు. కాగా రిపోర్ట్‌లో అతనికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో అతడు ఉన్న ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ శుభ్రపర్చింది. కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేపాల్ సింగ్ మాట్లాడుతూ.. పేషెంట్‌తో సన్నిహితంగా ఉన్న 200 మందిని ఐసోలేషన్‌లో ఉంచి, పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ కంటే ముందు కేరళ, మహారాష్ట్రల్లో జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, జికా వైరస్ ఈడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మొదటిసారిగా 1952 లో ఉగాండా, టాంజానియాలోని మానుషుల్లో గుర్తించబడింది. అంతకుముందు 1947లో యుగాండాలోని ఫారెస్ట్‌లో గల కోతుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు.
లక్షణాలు
సాధారణంగా తేలికపాటి జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పి లేదా తలనొప్పి లక్షణాలు కనబడుతాయి. రెండు-ఏడు రోజుల వరకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. లైంగిక సంపర్కం ద్వారా కూడా వైరస్ సంక్రమిస్తుంది. నిపుణులు జికా వైరస్ సంక్రమణ, ప్రతికూల గర్భం, పిండం ఫలితాల మధ్య అనుబంధాన్ని కూడా కనుగొన్నారు.