కల్తీ వ్యవహారంపై విరుచుకుపడ్డ సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కల్తీకి పాల్పడేవారిపై విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 25 Sept 2024 2:51 PM ISTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కల్తీకి పాల్పడేవారిపై విరుచుకుపడ్డారు. జ్యూస్‌ల దగ్గర నుండి బ్రెడ్ లాంటి సాధారణంగా వినియోగించే వస్తువులలో ఇటీవల జరిగిన కల్తీ వ్యవహారంపై యోగి ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. ఆహార కల్తీకి సంబంధించిన ఇటీవలి సంఘటనలను ఆయన ఖండించారు. ఈ చర్యలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ముఖ్యమంత్రి, ఇటువంటి పద్ధతులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు అని చెప్పారు.
ఆహార కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, స్థానిక అధికారుల మధ్య సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆహార సంస్థలు తమ ఆపరేటర్లు, యజమానులు, నిర్వాహకుల పేర్లు మరియు చిరునామాలను ప్రముఖంగా ప్రదర్శించాలన్నారు. ఈ నిబంధనలను అమలు చేయడానికి ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి సవరణలు చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ఆహార ఉత్పత్తుల్లో మానవ వ్యర్థాలు లేదా ఇతర హానికరమైన పదార్థాలను కలిపే వారి పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పునరుద్ఘాటించారు. అటువంటి చర్యలకు పాల్పడిన ఆపరేటర్లపై తీవ్రమైన జరిమానాలు విధిస్తామన్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆహార తయారీ, అమ్మకాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాల విషయంలో కఠినమైన నియమాలు ఉండాలన్నారు. ప్రజారోగ్య ప్రయోజనాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.