హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే మూడు నెలల పాటూ లైసెన్స్ సస్పెన్షన్
You Will Lose Your License For 3 Months If You Ride Without Helmets. హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తే మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు.
By Medi Samrat Published on 8 April 2022 6:30 PM IST
హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తే మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు. ఈ ఆంక్షలు ముంబైలో అమలులోకి రానున్నాయి. లైసెన్స్ రద్దుతో పాటు, రైడర్లకు జరిమానా కూడా విధించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, ముంబై ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను ప్రకటించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని అన్నారు. "హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి చలాన్‌ను వెంటనే RTOకి పంపబడుతుంది. అప్పుడు లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేయబడుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారు సమీపంలోని ట్రాఫిక్ చౌకీకి పంపబడతారు. డిఫెన్సివ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై రెండు గంటల పాటూ వీడియోలను చూడవలసి ఉంటుంది," DCP (ట్రాఫిక్) రాజ్ తిలక్ రోషన్ తెలిపారు.
ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ ఉన్నప్పుడు కూడా తమ వాహనాల హారన్‌లను మోగించే వ్యక్తులను క్రమశిక్షణలో ఉంచడానికి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ను జనవరిలో ముంబై పోలీసులు ప్రారంభించారు. 'ది పనిషింగ్ సిగ్నల్' అనే ప్రచారం ద్వారా ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేసింది. జాయింట్ పోలీస్ కమీషనర్ (ట్రాఫిక్) మధుకర్ పాండే మాట్లాడుతూ, "డెసిబెల్ మానిటర్లు.. ఎప్పటికప్పుడు శబ్దాన్ని వింటూ ఉంటాయి. 85-డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వచ్చినప్పుడు, సిగ్నల్ టైమర్ రీసెట్ చేయబడుతుందని.. అప్పుడు ఇంకా వెయిటింగ్ పిరియడ్ సిగ్నల్స్ దగ్గర పెరిగిపోతుంది" అని అన్నారు. 'ఎక్కువగా హారన్‌లు మోగించండి, ఎక్కువ సమయం వేచి ఉండండి' అనే సందేశం సిగ్నల్స్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్, మెరైన్ డ్రైవ్, పెద్దర్ రోడ్, బాంద్రాలోని ప్రధాన జంక్షన్‌లు, సిగ్నల్‌ల వద్ద డెసిబెల్ మీటర్లు యాక్టివేట్ చేశారు.