'మీకు ఓట్లు ఉన్నాయి.. నా దగ్గర డబ్బు ఉంది' : ఓట‌ర్ల‌కు అజిత్ పవార్ బెదిరింపులు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణెలోని మాలెగావ్‌లో మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే, నగరానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఓటర్లతో అన్నారు.

By -  Medi Samrat
Published on : 23 Nov 2025 7:24 AM IST

మీకు ఓట్లు ఉన్నాయి.. నా దగ్గర డబ్బు ఉంది : ఓట‌ర్ల‌కు అజిత్ పవార్ బెదిరింపులు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణెలోని మాలెగావ్‌లో మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే, నగరానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఓటర్లతో అన్నారు. ఓటర్లు తన అభ్యర్థులను తిరస్కరిస్తే, తాను నిధులు కూడా ఇవ్వనని పవార్ అన్నారు. మీకు ఓట్లు ఉన్నాయి.. కానీ అభివృద్ధి పనులకు నా దగ్గర డబ్బులు ఉన్నాయని అన్నారు. శుక్రవారం బారామతి తహసీల్‌లో మాలెగావ్ నగర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎన్‌సిపి అధ్యక్షుడు పవార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి-ఎన్‌సిపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో పవార్ ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్నారు.

మీరు మొత్తం 18 మంది ఎన్‌సిపి అభ్యర్థులను ఎన్నుకుంటే, నిధుల కొరత లేకుండా చూసుకుంటానని ఉప ముఖ్యమంత్రి ఓటర్లకు చెప్పారు. మీరు 18 మంది అభ్యర్థులను ఎన్నుకుంటే, నా హామీని నెరవేర్చడానికి నేను కట్టుబడి ఉన్నాను. కానీ, మీరు వారిని తిరస్కరిస్తే, నేను కూడా మిమ్మ‌ల్ని తిరస్కరిస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యను విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అజిత్ పవార్ ఓటర్లను బెదిరిస్తున్నారని శివసేన (యుబిటి) నేత అంబదాస్ దన్వే ఆరోపించారు.

అజిత్ పవార్ ఇంటి నుంచి కాకుండా సామాన్యులు చెల్లించే పన్నుల నుంచి నిధులు ఇస్తున్నారని గుర్తుంచుకోవాల‌న్నారు. పవార్ లాంటి నేతలు ఓటర్లను బెదిరిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్ర‌శ్నిస్తున్నారు. నగర పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 2న జరగనున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని NCP, BJP మాలేగావ్‌లో కూటమిగా ఏర్పడ్డాయి.

Next Story