ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయం మరింత వేడెక్కతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నన్ను చంపాలనుకుంటున్నారని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) చీఫ్ ఓంప్రకాష్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని శివపూర్ నియోజకవర్గం నుంచి తన పార్టీ అభ్యర్థి అరవింద్ రాజ్‌భర్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తుండగా.. సోమవారం తనపై దాడి జరిగిందని రాజ్‌భర్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న ఎస్బీఎస్పీ చీఫ్ ఓంప్రకాష్ రాజ్‌భర్ మాట్లాడుతూ.. యోగి జీ నన్ను చంపాలనుకుంటున్నారు. బీజేపీ, యోగి గూండాలను నల్లకోట్లలో అక్కడికి పంపించారని అన్నారు. గతంలో రాజ్‌భర్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగమైంది. అయితే.. 2019 లోక్‌సభ ఎన్నికలను స్వతంత్రంగా నిర్వహించాలని ఎస్బీఎస్పీ నిర్ణయించిన తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం.. వెనుకబడిన తరగతుల (OBC) పట్ల ఉదాసీన వైఖరిని కలిగి ఉందని ఎస్బీఎస్పీ పదేపదే ఆరోపించింది.