ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath takes oath as UP CM for historic second term
By Medi Samrat
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యోగి ఆదిత్యనాథ్ చేత ప్రమాణం చేయించారు. దీంతో యోగి వరుసగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన సీఎంగా నిలిచారు. ఐదేళ్ల పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత.. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ మౌర్య ఓడిపోయినప్పటికీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. దినేశ్ శర్మ స్థానంలో బ్రజేష్ పాఠక్‌ను నియమించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. లక్నోలో జరిగిన ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 255 సీట్లతో భారీ విజయం సాధించింది.